తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించేందుకు పరస్పర అంగీకారంతో వాస్తవాధీన రేఖ నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నాయి భారత్-చైనా. ఈ నేపథ్యంలో భారత భూభాగం ఒక్క అంగుళం కూడా దురాక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్(ఐటీబీపీ), సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) సారథి ఎస్ఎస్ దేశ్వాల్. దేశ భూభాగం మొత్తం భద్రతా దళాల అధీనంలోనే ఉందని ఉద్ఘాటించారు.
హరియాణా భోండ్సీలో బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు దేశ్వాల్. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి గురించి మీడియా అడిగినప్పుడు ఈ విషయాలను వెల్లడించారు.
"తూర్పు లద్దాఖ్ సహా పశ్చిమ, ఉత్తర సరిహద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి. అంకిత భావం, శక్తి సామర్థ్యాలతో కూడిన మన భద్రతా బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి శుత్రువు నుంచైనా సరిహద్దులను కాపాడగల సత్తా మన బలగాలకు ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ సరిహద్దును కాపాడేందుకు భద్రతా సిబ్బంది ఎన్నో త్యాగాలు చేశారు. వారికి మనోధైర్యం చాలా ఎక్కువ."
-ఎస్ఎస్ దేశ్వాల్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్.
1984 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దేశ్వాల్.. ఐటీబీపీ ముఖ్య అధికారి. నాలుగు నెలలుగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
పరస్పర అంగీకారం మేరకు తూర్పు లద్దాఖ్‌లో బలగాలను చైనా ఉపసంహరించుకుంటోంది. ఫింగర్-4 నుంచి తమ సైనికులను వెనక్కి తరలించింది. పాంగాంగ్ త్సో సరస్సులోని కొన్ని పడవలను తొలగించినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. సరిహద్దులో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొనేలా బలగాలను పూర్తి స్థాయిలో ఉపసంహరించుకునే విషయంపై చర్చించేందుకు త్వరలోనే లెఫ్టినెంట్ జరనల్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించనున్నాయి భారత్-చైనా.