పందుల్లో అత్యంత ప్రమాదకర అంటువ్యాధుల్లో ఒకటైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉనికి భారత్‌లో బయటపడింది. అసోంలో ఈ వ్యాధి బారిన పడి ఏడు జిల్లాల్లోని 306 గ్రామాల్లో దాదాపు 2,500 వరాహాలు మృత్యువాతపడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకుగాను పందులను సామూహికంగా చంపేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ.. తాము ఆ పని చేయబోమని పేర్కొంది. ప్రత్యామ్నాయ విధానాల్లో వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది.
వ్యాధి ఉనికి బయటపడ్డ ప్రాంతాలకు కిలోమీటరు పరిధిలోని అన్ని పందుల నుంచి నమూనాలు సేకరిస్తామని.. వ్యాధి బారిన పడ్డవాటిని మాత్రమే చంపేస్తామని వెల్లడించింది. ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ మానవులపై ప్రభావం చూపదని.. వ్యాధి ఉనికి లేని ప్రాంతాల్లో పంది మాంసాన్ని తినొచ్చునని స్పష్టం చేసింది.