తాలిబన్లతో శాంతి ఒప్పందం కుదరడం వల్ల భారత్ సహా ఏ దేశ భద్రతకూ ప్రమాదం లేదని అఫ్గాన్ ప్రభుత్వం తరపున ఆ ఉగ్రవాద సంస్థతో చర్చలు జరుపుతున్న అబ్దుల్లా అబ్దుల్లా శనివారం అన్నారు. అఫ్గానిస్థాన్‌కు భారత్ మిత్రదేశమని స్పష్టం చేశారు. తమ దేశానికి భారత్ ఎన్నో రకాలుగా సాయం చేసిందని తెలిపారు.
భారత్‌లో నాలుగు రోజుల పర్యటనను శనివారం ముగించుకున్నారు అబ్దుల్లా. భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన ఆయన.. తాలిబన్లతో శాంతి చర్చల విషయంపై అధికారులతో చర్చించారు.
శాంతి చర్చలు విజయవంతమైతే.. మళ్లీ తాలిబన్ ఉగ్రవాదుల ప్రభావం పెరుగుతుందని, ఆ సంస్థ జమ్ముకశ్మీర్‌పై దృష్టిసారించొచ్చన్న సందేహాలు ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్ ప్రభావం అఫ్గాన్‌పై పడుతుందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందం కారణంగా భారత్ సహా ఏ దేశ భద్రతకూ విఘాతం కలగదని అబ్దుల్లా తెలిపారు.
ఇదీ చదవండి- ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సై: ఐఏఎఫ్ పైలెట్స్