మెట్రో రైల్ డిపో నిర్మాణం కోసం ముంబయిలోని ఆరె కాలనీలో చెట్ల నరికివేత వ్యవహారంపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. చెట్ల నరికివేతపై జోక్యం కోరుతూ పలువురు న్యాయ విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయికి లేఖ రాశారు. విద్యార్థుల లేఖలకు స్పందించిన ఆయన.. కేసును సుమోటోగా స్వీకరిస్తూ అత్యవసర విచారణకు అంగీకరించారు.
ప్రత్యేక ధర్మాసనం..
వృక్షాల తొలగింపు వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. నేడు విచారణ చేపట్టనుంది ధర్మాసనం.
నిరసనలు..
మెట్రో ప్రాజెక్టు కోసం ఉత్తర ముంబయిలోని ఆరె కాలనీలో సుమారు 2,600 వృక్షాలను తొలగించేందుకు మెట్రో సంస్థ పనులు మొదలు పెట్టింది. పలు స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వేత్తలు దీనిని వ్యతిరేకించారు. మెట్రోకు వ్యతిరేకంగా బొంబయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిన హైకోర్టు.. గత శుక్రవారం మెట్రోకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆరె కాలనీ అటవీ ప్రాంతం కాదని పేర్కొంది. కోర్టు తీర్పు అనంతరం చెట్ల నరికివేతను ప్రారంభించింది ముంబయి మెట్రో. దీనికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు ఆ కాలనీ వాసులు, పర్యావరణ ప్రేమికులు.
ఇదీ చూడండి: 'అన్నం తినలేదని కొడితే.. పసి ప్రాణాలు పోయాయ్'