కరోనా మహమ్మారిపై ఎంతో మంది వైద్యులు ప్రత్యక్షంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎందరో వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాలను ఫణంగా పెట్టి వేల మంది రోగులకు అండగా నిలుస్తున్నారు. ఈ తరుణంలోనే చాలా మంది నీడను కోల్పోతున్నారు. వైద్యసేవలు అందించే వారికీ ఆ మహమ్మారి సోకుతుందనే భయంతో చాలామంది ఇంటి యజమానులు ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటున్నారు. దేశం కోసం ఎంతో కృషి చేస్తున్న వైద్యులు ఈ కష్ట సమయంలో నివాసం ఉండేందుకు తనకున్న రెండు ఫ్లాట్లను ఉచితంగా ఇవ్వడానికి ముందుకొచ్చింది కోల్కతాకు చెందిన సుచనా సాహా.
సుచనా సాహా కోల్కతా.. సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్లో యానిమేషన్ కోర్సు చేసింది. నగరంలోనే అమ్మానాన్నలతో కలిసి ఉంటోంది. మరోచోట ఖాళీగా ఉన్న తన రెండు ఫ్లాట్లను తాత్కాలికంగా వైద్యసిబ్బందికి ఇవ్వడానికి ఇంట్లో వారిని ఒప్పించింది. తన స్నేహితులనూ తోచిన సాయం చేయడానికి ముందుకు రావాలని సూచిస్తోంది సుచనా.
" వైద్యులు, సిబ్బంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి సేవలు అందిస్తున్నారు. దూర ప్రయాణం కారణంగా కొందరు ఆస్పత్రిలోనే ఉండిపోతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఫ్లాట్ల వివరాలు, నా ఫోన్ నంబరు సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచా. వీటిలో ఉండటానికి అద్దె చెల్లించనవసరం లేదు. చాలా మంది వైద్యులు, నర్సులు నన్ను సంప్రదించారు. కరోనా బాధితుల వార్డులో పనిచేస్తున్న ఓ నర్సును ఆమె అద్దెకుంటున్న ఇంటి యజమాని ఖాళీ చేయమన్నారట. ఆమె నాకు ఫోన్ చేసింది. ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి సాయపడుతున్నందుకు గర్వంగా ఉంది."
-- సుచనా సాహా, కోల్కతా
ఇదీ చదవండి: లంకలో భారతీయుల 'కరోనా' వ్యధలు వినరా...