తమిళనాడు మధురైకి చెందిన పూర్ణసుందరి ఈమె. దివ్యాంగురాలు. అయితేనేం.. యూపీఎస్సీ ర్యాంకు సాధించింది. మధురై జిల్లా మణినగర్ వాసి అయిన పూర్ణసుందరి యూపీఎస్సీ పరీక్షల్లో 286వ ర్యాంకు అందుకుంది. ఈ విజయం వెనుక ఉన్న ఆటుపోట్ల గురించి, పూర్ణ తల్లిని అడిగినప్పుడు... ఆమె ఆనందం కళ్లు చెమర్చేలా చేసింది.

"ఆమె పరీక్షలు రాసినప్పుడల్లా బెంగళూరు, చెన్నైకు తోడుగా వెళ్లా. తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని అనుకుంటున్నా. తుదిఫలితం వెలువడే ముందు.. అంతా మంచే జరుగుతుందని చెప్పా. కలెక్టర్ అయ్యానని చెప్పగానే కళ్లనుంచి నీళ్లు ఉప్పొంగాయి."
- ఆవుదాయ్ దేవి, పూర్ణ తల్లి
తాను చదివిన పాఠశాలకే అథితిగా...
ఐదేళ్ల వయసులోనే పూర్ణ చూపు కోల్పోయింది. చదువులో మాత్రం చురుగ్గా ఉండేది. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా ఉత్తీర్ణురాలైంది. చదువుకున్న పాఠశాలకే అతిథిగా వెళ్లింది పూర్ణ. జాతీయ జెండా ఎగురవేసి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. పూర్ణ చదువు గురించి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంతి కూడా ఎంతో ప్రశంసాపూర్వకంగా చెప్పారు.

"చాలా తెలివైన అమ్మాయి పూర్ణ. తనలాంటి ప్రత్యేక అవసరాలున్న చిన్నారులను మా పాఠశాలలో పూర్తిగా ప్రోత్సహిస్తాం. వారిపై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. అలా తీర్చిదిద్దిన అమ్మాయే పూర్ణ. ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఆమెకే కాదు మాకు కూడా ఇది గర్వకారణం."
- శాంతి, ప్రధానోపాధ్యాయురాలు
బయటివాళ్లు ఎంతమంది ప్రోత్సహించినా... కుటుంబ సహకారం ఎంతో అవసరమంటారు పూర్ణసుందరి తండ్రి.

"ఈ ఆనందం...మేం పడిన కష్టాన్నంతా మాయం చేసింది. ఈ సంతోషానికి సరితూగే విషయమే మరొకటి లేదు. పరమానందం అంటే ఇదేనేమో."
- మురుగేశన్, పూర్ణసుందరి తండ్రి
విశ్వాసం ఉంటే చాలు...
యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన తర్వాత... తన తర్వాతి లక్ష్యం ఏమిటని పూర్ణని అడిగితే ఇలా చెబుతోంది.
"నిర్దేశించుకున్న లక్ష్యం చేరగలమన్న విశ్వాసముంటే... అమ్మాయైనా, అదీ దివ్యాంగురాలైనా అనుకున్నది సాధిస్తారు. విద్య, పరిశుభ్రత, మహిళా సాధికారత అనే 3 అంశాల్లో విజయం కోసం ప్రతిఒక్కరూ కష్టపడాలి. దారిలో ఎన్ని అవరోధాలు ఎదురైనా అవకాశాలు అంది పుచ్చుకుని విజయం దిశగా దూసుకుపోవాలి."
- పూర్ణసుందరి, యూపీఎస్సీ ర్యాంకర్
నాలుగోసారి...
యూపీఎస్సీ పరీక్షల్లో 3సార్లు ఉత్తీర్ణత సాధించలేకపోయింది పూర్ణ. నాలుగోసారి ర్యాంకు కొట్టాలన్న దృఢ సంకల్పంతో బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే తీవ్రంగా శ్రమించింది.

"కష్టపడడం మానకూడదని తెలుసు. ఎంతకష్టపడ్డానంటే చివరికి 4వ ప్రయత్నంలో 286వ ర్యాంకు సాధించాను. ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంది. నా మంచి కోరేవాళ్లు ఈ విజయాన్ని వాళ్ల విజయంగానే భావిస్తున్నారు."
-పూర్ణసుందరి, యూపీఎస్సీ ర్యాంకర్
ఆర్థికంగా పెద్దగా స్థోమత లేకపోయినా తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో, కఠిన శ్రమతో... పూర్ణసుందరి తన సివిల్ సర్వీస్ కలను సాకారం చేసుకుంది.
ఇదీ చూడండి: ఆ చేతులే.. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నాయ్!