చేతిలో డబ్బు లేదు. పోనీ లాక్‌డౌన్ అయ్యే వరకు ఇక్కడే ఉందామంటే పూట గడవడం కష్టం. అలాగని నడిచి వెళ్దామంటే నడవలేని స్థితిలో కొడుకు. ఇలాంటి కష్ట సమయంలో ఆ వలస కూలీకి మరో దారి లేకపోలేకపోయింది. అంతరాత్మ అంగీకరించనప్పటికీ దొంగతనం చేయడం తప్పనిసరైంది. దీంతో ఓ ఇంటి బయట ఉంచిన సైకిల్‌ను ఎత్తుకెళ్లాడు. తనను క్షమించాలంటూ ఓ లేఖ రాసిపెట్టాడు. వలస కూలీ దుస్థితికి అద్దంపట్టే ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
యూపీలోని బరేలీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాన్ రాజస్థాన్లోని భరత్‌పూర్‌లో నివాసముంటున్నాడు. అతడితో పాటు దివ్యాంగుడు అయిన కుమారుడు కూడా ఉన్నాడు. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన అతడు ఇంటికెళ్లేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశాడు. నడవలేని స్థితిలో ఉన్న కుమారుడితో ఇంటికెళ్లేందుకు చివరికి భరత్‌పూర్‌లోని ఓ గ్రామంలో ఇంటి ముందున్న సైకిల్‌ను అపహరించాడు. మనసు అంగీకరించకపోవడంతో ఓ లేఖ రాసిపెట్టాడు.
"విధిలేని పరిస్థితిలో మీ సైకిల్ ఎత్తుకెళ్తున్నా. వీలైతే నన్ను క్షమించండి. మేం బరేలీ వెళ్లాలి. నాకో కుమారుడు ఉన్నాడు. వాడు నడవలేడు. వాడి కోసం ఈ పని చేయడం తప్పలేదు." అని ఆ వలస కూలీ లేఖ రాశాడు. అయితే తన సైకిల్ పొగొట్టుకున్న షాహిబ్ సింగ్ తొలుత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్నాడు. తీరా లేఖ చదివాక తన మనసు మార్చుకోవడం గమనార్హం.
ఇదీ చూడండి: 'మోదీ సర్కార్‌ది ప్యాకేజీ కాదు.. అంకెల గారడీ'