బంగాల్, హౌరాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. కరోనా బారినపడి మృతి చెందిన తండ్రి ముఖం చూసేందుకు తనయుడు రూ.51 వేలు చెల్లించాలన్నారు ఓ ఆసుపత్రి సిబ్బంది. అంతే కాదు, తండ్రి చనిపోయిన 12 గంటల వరకు ఆ వార్త తనయుడికి చెప్పలేదు.
హౌరా, సల్కియాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బందిపడుతూ ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆయనకు పరీక్ష చేయగా కరోనా సోకినట్లు నిర్ధరణయింది. ఆయన చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, ఆ సంగతి ఆసుపత్రి సిబ్బంది వెల్లడించలేదు. దాదాపు 12 గంటలపాటు కుటుంబసభ్యులంతా ఆయనకు చికిత్స చేస్తున్నారనే భావించారు. ఆ తర్వాత విషయం తనయుడికి చెప్పారు. గుండెలు పగిలేలా ఏడుస్తూ... ఒకే ఒక్కసారి నాన్న ముఖం చూపించమని వేడుకున్నాడు.
మృతి చెందిన తండ్రి ముఖం చూడాలంటే రూ.51 వేలు చెల్లించాలన్నారు సిబ్బంది. అలా చెల్లిస్తే, ఆరోగ్యశాఖ వెల్లడించిన నిబంధనల ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామన్నారు. అంత స్థోమత లేదని మొరపెట్టుకున్నా వినలేదు. ఆఖరికి బేరమాడి రూ.2500 చెల్లించి తండ్రి ఆఖరి చూపుకు నోచుకున్నాడు ఆ కుమారుడు.
ఇదీ చదవండి: సతీమణికి నిలువెత్తు మైనపు విగ్రహం