బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ రాజకీయ పార్టీలకు కరోనా గుబులు పుట్టిస్తోంది. ఆ రాష్ట్ర భాజపాకు చెందిన 75 మందికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో సీనియర్ నాయకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వైరస్ సోకిన నాయకులలో భాజపా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర నాథ్, రాష్ట్ర కార్యదర్శి దినేశ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ వర్మ, భాజపాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు.
మొత్తం 100 మంది నాయకుల నమూనాను సేకరించగా.. వారిలో 75 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజకీయ నాయకులు వైరస్ బారిన పడిన కారణంగా రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆందోళనకు గురవుతున్నారు
అక్టోబర్-నవంబర్‌లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ భాజపా నాయకులు నిరంతరం ప్రజలను కలుస్తున్నారు. పార్టీ కార్యాలయంలో తరచూ నాయకులు భేటీ అవుతున్నారు. అదే సమయంలో వర్చువల్ ర్యాలీలను నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులకు వారితో సంబంధం ఉన్న వారిని వెతకటం పెద్ద సవాలుగా మారింది.