కేరళ కోజికోడ్‌లోని కూడతాయిలో 'జాలీ' అనే సైకో మహిళ సృష్టించిన విషాదం ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆస్తి కోసం అత్త, మామ, సొంత భర్తను కూడా వదలకుండా విషం పెట్టి చంపింది జాలిలేని 'జాలీ'. చివరికి ఆమె మరిది ఫిర్యాదు మేరకు 17 ఏళ్ల తర్వాత ఈ కేసును ఛేదించారు పోలీసులు. కేరళలో తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగలోకి వచ్చింది.
ఏడుగురిని చంపి.. రూ.50 కోట్లు చోరీ
తిరువనంతపురం కరమన పట్టణంలో గోపీనాథన్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఏడుగురు ఇదేవిధంగా అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. గత 15 ఏళ్లుగా వీరందరూ మరణించినట్లు అదే కుటుంబానికి చెందిన ప్రసన్న కుమారి అనే మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్తి కోసమే వీరందరినీ ఎవరో చంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తమ బంధువులను హత్య చేసి రూ.50 కోట్లు విలువ చేసే ఆస్తులను దొంగిలించినట్లు పోలీసులకు తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మృతుల్లో గోపీనాథన్‌తో పాటు అతని భార్య సుఖుమియమ్మ, కూతురు జయశ్రీ, కుమారులు జయబాలక్రిష్ణన్, జయప్రకాశ్, బంధువులు ఉన్నిక్రిష్ణన్, జయమాధవన్లు ఉన్నట్లు ప్రసన్న తెలిపింది.
అలాంటిదేమీ లేదు
తిరువనంతపురం డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా ఈ ఘటనపై స్పందించారు. ఈ హత్యల వెనుక ఏదో రహస్యం దాగుందని ప్రకటించారు. అయితే ఇవి కూడతాయి గ్రామంలో జాలీ సృష్టించిన విషాదం లాంటివి కాదని.. అతి త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు.