ఈశాన్య దిల్లీలో ఇటీవల జరిగిన అల్లర్లపై పోలీసులు ఇప్పటివరకు 690 కేసులు నమోదు చేశారు. 2,200 మంది వరకు అదుపులోకి తీసుకున్నట్లు దిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. ఇందులో 48 కేసులు ఆయుధ చట్టం కింద నమోదయ్యాయి. అయితే గత ఆరు రోజులుగా అల్లర్లపై పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి ఫోన్లు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.
2,193 మందిని అరెస్టు చేయగా.. మరో 50 మందిపై ఆయుధ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
హత్య కేసులో అదుపులోకి...
ఈ అల్లర్లలో భాగంగా షానవాజ్ అనే వ్యక్తి ఒకరిని హత్య చేసినట్లు ఆరోపణల వస్తోన్న నేపథ్యంలో.. పోలీసలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది క్రైం బ్రాంచ్.
పోలీసుకే తుపాకి గురిపెట్టి
మరోవైపు కానిస్టేబుల్ తలకు తుపాకిని గురి పెట్టినందుకు గానూ షారుఖ్ పటన్ అనే వ్యక్తిని మరో మూడు రోజులు కస్టడీలో ఉంచాలని దిల్లీ కోర్టు పేర్కొంది. అల్లర్ల నేపథ్యంలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
50 మంది బలి
ఈశాన్య దిల్లీలో గతవారం సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అనేక ప్రాంతాల్లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి.