సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. కాసేపట్లో ఆరో విడత పోలింగ్ మొదలుకానుంది. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా ఇప్పటికే ఈసీ చర్యలు తీసుకుంది.
ఆరో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్‌లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, బంగాల్‌లో 8, దిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 979 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10 కోట్ల 17 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రధానంగా భాజపా- ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి మధ్య పోరు నెలకొంది.
- సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ అజంగఢ్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి మేనకా గాంధీ సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
- ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న 14 నియోజకవర్గాల్లో 2014లో భాజపా 13 చోట్ల నెగ్గింది.
- మధ్యప్రదేశ్ భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఇటీవల భాజపాలో చేరిన మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.
- కాంగ్రెస్ కంచుకోట గుణ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. మోరేనా లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ థోమర్ బరిలో ఉన్నారు.
దిల్లీ పోరు త్రిముఖం...
- దేశ రాజధాని దిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ భాజపా, ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ముక్కోణపు పోరు నెలకొంది.
- దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్, బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్షవర్థన్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వంటి ప్రముఖులు ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బంగాల్‌లో పటిష్ఠ భద్రత...
బంగాల్‌లో 5 జిల్లాల పరిధిలోని 8 నియోజకవర్గాల్లో కాసేపట్లో పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, భాజపా, కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇక్కడ పోటీ నెలకొంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 770 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు.
ఇదీ చూడండి: ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు- ప్రయాణికులు సురక్షితం