నూతన సంవత్సరం వేడుకలు మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. మరికాసేపట్లో కొత్త సంవత్సరం సంబరాలు నిర్వహించుకోవడానికి సిద్ధమవుతుండగా లిఫ్ట్ రూపంలో మృత్యువు కబళించింది. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఏమైందంటే..?
కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని కుటుంబం మొత్తం వారి ఫాంహౌస్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న ఓ టవర్‌కు లిఫ్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తాత్కాలిక లిఫ్ట్‌లో పైకి వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే లిఫ్ట్ కిందకు పడిపోయింది. అందులో ఉన్న ఏడుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దగ్గర్లో ఉన్న రైతులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు.