అమెరికాలో నిర్వహించే ప్రతిష్టాత్మక 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' పోటీల్లో ఆరుగురు భారత సంతతి విద్యార్థులు చరిత్ర సృష్టించారు. విజేతలుగా నిలిచి ఒక్కొక్కరు 50 వేల అమెరికన్ డాలర్ల నగదు, బహుమతులు గెలుచుకున్నారు.
565 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ మెగా పోటీలో ఈసారి ఎనిమిది మంది విద్యార్థులు విజేతలుగా నిలవడం విశేషం. అందులో ఆరుగురు భారత సంతతి విద్యార్థులు ఉండటం మరో విశేషం. గత 94 ఏళ్లలో ఇలా ఇద్దరికి మించి గెలవడం ఇదే మొదటిసారి.
విజేతలు వీరే..
- రిషిక్ గంధశ్రీ (13), కాలిఫోర్నియా
- సాకేత్ సుందర్ (13), మేరీలాండ్
- శృతికా పాడి (13), న్యూజెర్సీ
- సోహమ్ సుఖాంకర్ (13), టెక్సాస్
- అభిజయ్ కొడాలి (12), టెక్సాస్
- రోహన్ రాజా (13), టెక్సాస్
- క్రిస్టోఫర్ సెర్రో (13), న్యూజెర్సీ
- ఎరిన్ హోవార్డ్ (14), అలబామా
ఐదు రౌండ్లపాటు జరిగిన ఈ పోటీల్లో ఈ ఆరుగురు బాలురు, ఇద్దరు బాలికలు... తమను అడిగిన 47 పదాలకు స్పెల్లింగ్‌లను సరిగ్గా చెప్పి విజేతలుగా నిలిచారు. మేరీల్యాండ్.. గెలోర్డ్ నేషనల్ రిసార్ట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈఎస్పీఎన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
మెగా పోటీ....
సుమారు 7 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే పాల్గొనే ఈ స్పెల్లింగ్ బీ పోటీల్లో... అమెరికాతో పాటు కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది. అత్యంత భారీ స్థాయిలో, ఎంతో ఒత్తిడితో కూడుకున్న ఈ పోటీల కోసం విద్యార్థులు నెలల తరబడి శిక్షణ పొందుతారు.
ఇదీ చూడండి: జేపీ నడ్డాకు భాజపా సారథ్య బాధ్యతలు!