దేశంలో గడిచిన రెండేళ్లలో 460 మంది నక్సల్స్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. అదే సమయంలో నక్సలైట్లతో పోరులో 161 మంది భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
సమాచార హక్కు చట్టం ప్రకారం నోయిడాకు చెందిన న్యాయవాది రంజన్ తోమర్ దాఖలు చేసిన అభ్యర్థనకు.. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని 'వామపక్ష తీవ్రవాద' విభాగం 2018 నుంచి 2020 నవంబర్ మధ్య కాలానికి చెందిన గణాంకాలను వెల్లడించింది.
కాగా, 2020 సెప్టెంబర్లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గిపోయింది. నక్సల్స్ ప్రభావం 46 జిల్లాలకు పరిమితమైంది. 2010లో నక్సల్స్ కారణంగా మరణించిన భద్రతా దళాలు, పౌరుల సంఖ్య 1,005గా ఉండగా.. 2019 నాటికి 202కు పరిమితమైంది.
ఏడాది | పౌరులు, జవాన్ల మరణాలు |
2017 | 263 |
2018 | 240 |
2019 | 202 |
2020 | 102 |
మరోవైపు, దేశవ్యాప్తంగా 2004-2019 మధ్య 8,197 మంది నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారని హోంశాఖ తన వెబ్సైట్లో పేర్కొంది. ఇందులో అధిక శాతం గిరిజనులే ఉన్నారని తెలిపింది. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతోనే ఎక్కువ మందిని చంపేశారని వెల్లడించింది.
అయితే 11 రాష్ట్రాల్లోని 90 నక్సల్స్ ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గతంలో వెల్లడించారు. ఈ జిల్లాలను భద్రత సంబంధిత వ్యయాల పథకంలో చేర్చి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: దేశంలో 73కు చేరిన కొత్త కరోనా కేసులు