కరోనా నుంచి కోలుకున్నాం.. కొవిడ్ మళ్లీ సోకదులే అని అజాగ్రత్తగా ఉన్నారా? మీకు హెచ్చరిక. కరోనా వైరస్ రీఇన్ఫెక్షన్ కేసులు భారత్‌లోనూ వెలుగుచూశాయి. తొలిసారి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసింది ఐసీఎంఆర్. కొవిడ్-19 నుంచి కోలుకొని మళ్లీ వైరస్ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వారిలో ఇద్దరు ముంబయికి చెందిన వారు కాగా ఒకరు అహ్మదాబాద్ వ్యక్తిగా పేర్కొంది.
సవరణ...
కరోనా వైరస్ మళ్లీ వచ్చేందుకు అంచనా వేసిన కాలవ్యవధిని.. 110 నుంచి 100 రోజులకు సవరిస్తున్నట్టు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బల్రామ్ భార్గవ్ తెలిపారు. నాలుగు నెలల పాటు యాంటీబాడీలు శరీరంలోనే ఉంటాయన్న పలు పరిశోధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలపారు.
"రెండోసారి జబ్బు బారిన పడటానికి సంబంధించిన తొలి కేసు హాంగ్‌కాంగ్‌లో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇలాంటి కేసులు ప్రస్తుతం ప్రపంచ్యాప్తంగా 24 ఉన్నాయి. వాటిల్లో 3 కేసులు భారత్‌లో ఉన్నాయి. రెండు ముంబయిలో ఒకటి అహ్మదాబాద్‌లో నమోదైంది. బాధితులను పర్యవేక్షణలోకి తీసుకొని మరిన్ని వివరాలు సేకరిస్తాం"
-- బల్రామ్ భార్గవ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్.
రెండోసారి వ్యాధి బారిన పడేందుకు ఉన్న కాల వ్యవధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సరైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు బలరామ్. భారత ప్రభుత్వం మాత్రం 100రోజులుగా పరిగణిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- సీజనల్ వ్యాధుల వేళ కొవిడ్ కొత్త మార్గదర్శకాలు