వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసిన తన కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు ఓ యువకుడు. ఇంట్లో ఉన్న ఆరుగురిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల్లోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన పంజాబ్లోని మోగా జిల్లా నథువాలా గార్బి గ్రామంలో జరిగింది.
మృతుల్లో అతని తల్లి బిందెర్ కౌర్ (50), తండ్రి మంజీత్ సింగ్ (55), చెల్లెలు అమంజోత్ కౌర్ (33), నానమ్మ గుర్దీప్ కౌర్ (70), మేనకోడలు మనీత్ కౌర్ (3) ఉన్నారు. అతని తాత తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
నిరుద్యోగి..
ఈ దురాగతానికి ఒడిగట్టేందుకు అతను తుపాకీని తమ బంధువుల నుంచి దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు పాల్పడిన వ్యక్తి ఏ పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ క్రమంలో డిసెంబర్లో అతని వివాహం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకు అంగీకరించని ఆ వ్యక్తి కుటుంబసభ్యులతో తరచూ గొడవలకు దిగేవాడు. తాజాగా ఇదే అంశంలో తగాదా పెరిగి.. హత్య చేసుంటాడని భావిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: భార్యను పందెం కట్టి- ఆపై అత్యాచారానికి ఉసిగొల్పి!