తమిళనాడులో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.
ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. తిరుప్పూర్ సమీపంలోని అవినాషి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు-కంటైనర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణిస్తుండగా 20 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. కేరళ ఆర్టీసీ బస్సు సేలం నుంచి తిరువనంతపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను తిరుప్పూర్, కోయంబత్తూర్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కంటైనర్ లారీ క్లీనర్ మృతి చెందగా, డ్రైవర్ పరారీలో ఉన్నాడు. తిరుప్పూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదంపై కేరళ సర్కారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేరళ రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి బయల్దేరారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. మరోవైపు ఘటనాస్థలికి వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పాలక్కాడ్‌జిల్లా కలెక్టర్‌ను సీఎం విజయన్ ఆదేశించారు.
మరో ఘటనలో ఆరుగురు నేపాలీలు మృతి
సేలం జిల్లా ఓమలూరులో టెంపో వాహనం-బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విదేశీ యాత్రికులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులందరూ నేపాల్ వాసులుగా గుర్తించిన పోలీసులు.. వీరంతా తీర్థయాత్రల కోసం భారత్ వచ్చినట్లు తెలిపారు.