దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. సిగరెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని 23 ఏళ్ల యువకుడిపై తుపాకీతో దాడికి తెగబడ్డారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ యువకుడి చాతిలోకి తూటా దూసుకెళ్లింది. హత్యా యత్నం కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం
ఆమిర్ ఖాన్ అనే 23 ఏళ్ల యువకుడు గురువారం రాత్రి 9:30 ప్రాంతంలో తన స్నేహితునితో కలిసి ఓ షాపింగ్ మాల్ దగ్గర్లో నిల్చున్నారు. ఇంతలో ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆమిర్ ఖాన్‌ను సిగరెట్ ఇవ్వమని అడిగారు. అందుకు ఆమిర్ ఖాన్ నిరాకరించారు.
ఈ కారణంగా ఆ దుండగులు ఆమిర్‌తో వాగ్వాదానికి దిగారు. ఒకడు తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత దుండగులిద్దరూ ఆక్కడి నుంచి బెక్‌పై పరారయ్యారు.
తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దారి ఆడిగితే చంపేశారు
గతంలోనూ సిగరెట్ కోసం ఇలాంటి దాడులు జరిగాయి.
సిగరెట్ షాప్‌కు దారి అడిగినందుకు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పని చేస్తున్న బోధనేతర ఉద్యోగిని కొట్టి చంపారు కొందరు స్థానికులు.
ఈ దాడిలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగింది.
సిగరెట్ ఇవ్వనంటే చంపేశారు
గతేడాది మార్చిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కంప్యూటర్ డిజైనింగ్ చదువుతున్న 23 ఏళ్ల యువకుడు సిగరెట్ ఇచ్చేందుకు నిరాకరించాడని... నలుగురు వ్యక్తులు ఆ యువకుడిని చంపేశారు.