త్రిపురలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 1,200 కిలోల ఎండు గంజాయిని ఉత్తర త్రిపుర జిల్లా పోలీసులు సోమవారం సీజ్ చేశారు. వీటిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు బిహార్వాసులను అరెస్టు చేశారు.
గంజాయి విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని.. జిల్లా ఎస్పీ భానుపాద చక్రవర్తి తెలిపారు. ఓ ఆయిల్ ట్యాంకర్లో దీన్ని తరలిస్తుండగా.. త్రిపుర-అసోం సరిహద్దులో పట్టుకున్నట్లు వెల్లడించారు.
"నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో కూడిన ఓ ఆయిల్ ట్యాంకర్లో గంజాయిని తరలిస్తున్నారని మాకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించాం. 20 కేజీల బరువున్న 60 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,200 కేజీల గంజాయిని సీజ్ చేశాం. నిందితులను ఉమేశ్ సింగ్, పప్పీ రేగా గుర్తించాం. వీరిద్దరు గువాహటి నుంచి అగర్తలాకు ప్రయాణిస్తున్నారు."
-భానుపాద చక్రవర్తి, ఉత్తర త్రిపుర ఎస్పీ
నార్కోటిక్స్ డ్రగ్స్ చట్టం ప్రకారం చురైబరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గంజాయి తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని సైతం సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా డాక్టర్ల రిలే నిరాహార దీక్షలు