2018లో దేశ వ్యాప్తంగా సగటున 109 చిన్నారులు లైంగిక వేధింపులకు గురయ్యారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తెలిపింది. 2017తో పోలిస్తే ఈ అకృత్యాలు 22 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 2017లో 32,608 లైంగిక వేధింపుల కేసులు నమోదవగా, 2018లో 39,827 కేసులు నమోదైనట్లు ప్రకటించింది. అంతేకాకుండా 2018లో 21,605 మంది చిన్నారులు అత్యాచారానికి గురైనట్లు పేర్కొంది. వీరిలో 21,401 మంది బాలికలు ఉండగా, 204 మంది బాలురు ఉన్నట్లు స్పష్టం చేసింది.
చిన్నారులు అత్యాచారానికి గురవుతున్న రాష్ట్రాల్లో మహరాష్ట్ర 2,832 మందితో ముందు వరుసలో ఉంది. తర్వాతి స్థానంలో 2023 మందితో ఉత్తర్‌ప్రదేశ్, 1457 మందితో తమిళనాడు రాష్టాలు ఉన్నాయి.
2008-18 మధ్య కాలంలో...
2008-18 దశాబ్ద కాలంలో పిల్లలపై జరిగిన నేరాల గణాంకాలను కూడా విడుదల చేసింది ఎస్సీఆర్బీ. 2008తో పోలిస్తే 2018 నాటికి నేరాలు ఆరు రెట్లు పెరిగినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. 2008లో 22,500 కేసులు నమోదు కాగా, 2018 నాటికి 1,41,714 కేసులు నమోదైనట్లు వివరించింది. 2017లో 1,29,032 కేసులు నమోదయినట్లు నివేదికలో పేర్కొంది.
కిడ్నాప్‌కు గురైన పిల్లలు...
2018లో పిల్లలకు వ్యతిరేకంగా నమోదైన కేసుల్లో 44.2 శాతం అపహరణవి కాగా, 34.7 శాతం పోక్సో చట్టం కింద నమోదైనవిగా గణాంకాలు చెబుతున్నాయి. 2018లో మొత్తం 67,134 మంది చిన్నారులు కనబడకుండా పోగా వారిలో 19,784 మంది బాలురు, 47,191 మంది బాలికలు, 159 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నట్లు నివేదికలో పొందుపరిచింది.
71,176 మంది చిన్నారులను 2018లో పోలీసులు పట్టుకోగా వారిలో 22,239 బాలురు, 48,787 బాలికలు, 150 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నట్లు వెల్లడించింది.
వ్యభిచార కూపంలోకి...
పిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచార కూపంలోకి లాగుతున్న కేసులు 2017లో 331 కేసులు కాగా, వీటికి రెండింతలు...2018లో 781 కేసులు నమోదైనట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదవుతున్న రాష్ట్రాలో 51 శాతం కేసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, బిహార్ రాష్ట్రాల్లోనే జరుగుతున్నట్లు తెలిపింది. వీటిలో 19,936 కేసులతో (14 శాతం) ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్ (18,992), మహారాష్ట్ర (18,892) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి
వసతి గృహాల్లో లైంగిక వేధింపులు...
మహిళలపై, పిల్లలపై వసతి గృహాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు 2017తో పోలిస్తే 2018లో 30 శాతం పెరిగినట్లు చెబుతోంది. 2017లో 544 కేసులు నమోదు కాగా, 2018లో 707 నమోదైనట్లు పేర్కొంది. బాలల వివాహ చట్టం కింద 2017లో 395 కేసులు నమోదు కాగా, 2018లో 26 శాతం పెరిగి 501 కేసులు నమోదైనట్లు నివేదికలో పొందుపరిచింది ఎన్సీఆర్బీ.
ఇదీ చూడండి:వాయుసేనలోకి మరో 200 యుద్ధ విమానాలు!