Nude Video Blackmail: నగ్న వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకునే ముఠాల అరాచకాలు పెరిగిపోయాయి. యువతులతో సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడించి.. అవతలి వ్యక్తిని నగ్నంగా కనిపించేలా కవ్విస్తారు. రహస్యంగా ఆ వీడియోని రికార్డు చేసి.. అసలు కథ షురూ చేస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తారు. దీంతో పరువు పోతుందని కొందరు డబ్బులు ఇచ్చేస్తే.. మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఇటువంటి విషాద ఘటన కర్ణాటక బెంగళూరులో వెలుగుచూసింది. ఓ ఇంజినీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అతని న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్ చేయడంతో బెంగళూరుకు ఇంజినీర్ రైలు కింద పడి చనిపోయాడు. అతడిని నగరానికి చెందిన రోహిత్‌గా అధికారులు గుర్తించారు. నగరంలో మల్లేశ్వరం ప్రాంతానికి సమీపంలో జనవరి 25న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై..
రోహిత్ తన కుటుంబంతో నగరంలో నివాసముంటున్నాడు. రోహిత్ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాలో ఓ యువతి పరిచయమైంది. రోజూ చాటింగ్ చేయడం వల్ల వారి స్నేహ బంధం బలపడింది. ఫోన్, వీడియో కాల్లో మాట్లాడటం, చాటింగ్ చేయడం వంటివి జరిగేవి. ఈ క్రమంలో ఆ యువతి కోరిక మేరకు వీడియో కాల్లో న్యూడ్‌గా కనిపించాడు రోహిత్. దానిని రహస్యంగా రికార్డు చేసిన ఆ యువతి.. కొన్ని రోజులకు అసలు రంగు బయటపెట్టింది. ఆ వీడియోతో బెదిరించి.. డబ్బు డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసింది. ఆమె వేధింపులు తళలేక చివరకు రైలు కింద తలపెట్టి బలవన్మరణం చెందాడు రోహిత్. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో అధికారులకు ఈ విషయం తెలిసింది.
న్యూడ్ గ్యాంగ్ పనేనా..?
ఇటువంటి బెదిరింపుల కారణంగానే ఇటీవల ఓ యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసులో అమ్మాయిగా మాట్లాడిన భోపాల్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రోహిత్ మరణం వెనుక న్యూడ్ గ్యాంగ్ ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
ఆత్మహత్యలకు పాల్పడొద్దు
"ఇటీవల ఈ తరహా మోసాలు బాగా పెరిగాయి. వారి ఉచ్చులో చిక్కి గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భయంతోనో, అవమానంతోనో ఆత్మహత్యలు చేసుకోవద్దు. సోషల్ మీడియా అలవాట్లను నియంత్రించుకోవాలి" అని రైల్వే ఏడీజీపీ భాస్కర్‌రావు యువతకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: దివ్యాంగురాలైన కుమార్తెపై తండ్రి అత్యాచారం