బంగాల్లో రాజకీయ హింస రాజ్యమేలుతోందని.. విమర్శలు గుప్పిస్తోన్న భాజపా. తాజాగా మరో వివాదానికి తెరలేపింది. బంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లా నింతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉత్తర డుండుం ప్రాంతంలో నివాసముంటున్న గోపాల్ మజుందార్ అనే భాజపా కార్యకర్త ఇంటిపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించింది. మజుందార్, అతని తల్లిని తృణమూల్ నేతలు విచక్షణా రహితంగా కొట్టారని కమలదళం మండిపడింది.
"వాళ్లు నా తల, మెడమీద దాడి చేశారు. నా ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నాకు చాలా భయం వేసింది. ఎవరితో చెప్పొద్దని బెదిరించారు. నా శరీరం మొత్తం నొప్పిగా ఉంది."
- మజుందార్ తల్లి ఆవేదన
ఈ ఘటనపై బరాక్పుర్ కమిషనర్ స్పందించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మజుందార్‌పై దాడి చేశారన్నారు. అయితే మజుందార్ తల్లిపై ఎవరూ దాడి చేయలేదని.. ఆమెకున్న వ్యాధి వల్ల ముఖం అలా మారిందని స్పష్టం చేశారు. ఈ దాడికి కారణం కుటుంబ కలహాలా? లేక రాజకీయ కక్ష? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఘటనపై టీఎంసీ ప్రతినిధి డెరెక్ ఒబ్రెయిన్ ట్వీట్ చేశారు. తృణమూల్ పాజిటివ్‌గా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తోందన్నారు. మమతా సర్కార్‌పై ప్రశ్నించటానికి ఏమీ లేక ఇలా ఆరోపణలు చేస్తున్నారన్నారు. భాజపా ఒక ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా అభివర్ణించారు.
ఇదీ చదవండి : 'వారికి ప్రజా సంక్షేమం కంటే.. వారసత్వమే ముఖ్యం'