World smallest girl: ఈమె పేరు సోనాలి. ఆమె వయసు ఓ ఏడాదో.. రెండేళ్లో ఉంటుందనుకుంటే పొరపాటే. ఇప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు. జన్యులోపంతో పుట్టిన ఆమె వయసుకు తగినట్లు ఎదగలేదు. కేవలం ఒకటిన్నర అడుగుల ఎత్తున్న ఆమె.. ప్రపంచంలోనే అతిచిన్న యువతిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
బడ్వానీ జిల్లా ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అందరి దృష్టిని ఆకర్షించింది పాన్సేమల్ తహసీల్‌లోని ఆమ్దా గ్రామానికి చెందిన సోనాలి కంటిలాల్. దివ్యాంగుల ధ్రువపత్రం తీసుకునేందుకు తన కుటుంబ సభ్యులతో శిబిరానికి వచ్చింది. ఆమె 2005లో జన్మించిందని.. ప్రస్తుతం వయసు 17 ఏళ్లు ఉంటుందని తల్లిదండ్రులు చెప్పగా అక్కడి వైద్యులు, అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. సోనాలి చూసేందుకు దాదాపు రెండేళ్ల వయసున్న పాపలా కనిపిస్తుంది. జనన ధ్రువపత్రం పరిశీలించిన వైద్యులు వయసు నిర్ధరించుకుని.. ఆ తర్వాత అన్ని పరీక్షలు చేసి దివ్యాంగుల ధ్రువపత్రం జారీ చేశారు.
ఆమ్దా గ్రామానికి చెందిన కంటిలాల్కు నలుగురు పిల్లలు కాగా.. సోనాలి అందరికన్నా పెద్ద. ఆమె తర్వాత ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. వారందరూ సాధారణంగానే ఉన్నారు. కానీ, సోనాలి వయసుకు తగినట్లుగా ఎదగలేదు. ఇప్పటికీ ఆమెను ఒక చిన్న పాపలాగే చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. సరిగా నిలబడలేదు, మాట్లాడలేదు. అన్ని పరీక్షలు చేశాక వైద్యులు దివ్యాంగుల ధ్రువపత్రం ఇచ్చారని, దీని ద్వారా నెలకు వెయ్యి రూపాయలు పింఛన్ వస్తుందని తెలిపారు కంటిలాల్.
"మా పాప దివ్యాంగురాలిగానే జన్మించింది. ఆమెకు భోజనం, నీళ్లు ఇచ్చేందుకు ఒక వ్యక్తి ఉండాలి. ఆసుపత్రిలో పాప పరిస్థితి గురించి చెప్పాను. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందటం లేదని మా గ్రామస్థులు సైతం తెలిపారు. పాపకు ఇప్పుడు 17 ఏళ్లు పూర్తయ్యాయి. వికలాంగుల ధ్రువపత్రం తీసుకున్నాం. కానీ మాకు ఎలాంటి సాయం అందటం లేదు."
- కంటిలాల్, తండ్రి.
ప్రపంచంలోనే అతిచిన్న మహిళ అనగానే మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన జ్యోతి కిసాంజి అమ్గె గుర్తుకు వస్తారు. రెండు అడుగుల ఎత్తున్న ఆమె.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అయితే.. సోనాలి ఎత్తు జ్యోతి కంటే తక్కువ. ఈ కారణంగా ప్రపంచంలోనే అతిచిన్న యువతిగా సోనాలి పేరు త్వరలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కనుందని బడ్వానీ జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
ఈ సమస్య జన్యుపరమైన లోపం వల్ల వస్తుందని వైద్యులు చెప్పారు. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి అయోడిన్ లోపంతో బాధపడటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం, విటమిన్ డీ లోపం వంటి కారణాలతో ఇలాంటి సమస్య ఎదురవుతుంటుందన్నారు. దాని ద్వారా పుట్టే బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎదగదని తెలిపారు.
ఇదీ చూడండి: వరుడి విగ్గు ఊడటం చూసి వధువు షాక్.. పెళ్లి అర్థాంతరంగా రద్దు