కరోనాతో భార్య మరణించింది. ఇంట్లో నలుగురు కుమార్తెలున్నారు. వారికి ఓ తల్లి ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. తన భార్య సోదరిని వివాహమాడాలని ఆశించాడు. కానీ, అత్తామామలు ఇందుకు నిరాకరించడం వల్ల దారుణానికి ఒడిగట్టాడు. కన్న బిడ్డల్నే కడతేర్చాడు. ఈ ఘటన రాజస్థాన్(Barmer News) లో జరిగింది.
ఇదీ జరిగింది..
బాడ్మేర్(Barmer News) పోశాల గ్రామానికి చెందిన పుర్కా రామ్.. తొలుత తన నలుగురు కుమార్తెలు జియో(9), నోజి(7), హీనా(3), లాసికి(ఏడాదిన్నర) విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న వాటర్ ట్యాంక్‌లో తోసేశాడు. తర్వాత పుర్కా రామ్ కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడని ఎస్హెచ్ఓ ఓం ప్రకాశ్ తెలిపారు.
బాధితుడు వాటర్ ట్యాంక్‌లో దూకుతుండగా పొరుగింటివారు గమనించి పోలీసులకు సమాచారం అందించారని అధికారి వెల్లడించారు.
"నలుగురు పిల్లలు నీటిలో మునిగిపోయి మరణించారు. వారి మృతదేహాలను సమీపంలోని మార్చురీకి తరలించాం. పుర్కా రామ్‌ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించాం. పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాలను కుటుంబసభ్యులకు అందించాం."
-ఓం ప్రకాశ్, ఎస్హెచ్ఓ
ఐదు నెలల క్రితమే పుర్కా సతీమణి కరోనా కారణంగా మృతిచెందినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం.. పుర్కా తన భార్య సోదరిని వివాహమాడాలని ఆశించినట్లు తెలిసింది. కానీ, ఆమెతో వివాహానికి అత్తామామలు నిరాకరించారు. దీంతో పిల్లలను చంపి ఆత్మహత్యకు యత్నించాడని సమాచారం.
ఇదీ చదవండి: నిమజ్జనంలో అపశృతి- కుంటలో పడి బాలికలు మృతి