భిక్షాటనను వ్యాపారంగా మార్చి డబ్బులు సంపాదిస్తున్న ముఠాను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. సానుభూతి కోసం చిన్నపిల్లలను అద్దెకు తెచ్చుకొని వీరు భిక్షాటన చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నా, పెద్దా అని తేడా లేక అందరినీ ఈ దందాలోకి దించేస్తున్నారు యాచకులు. బస్సులు, రైల్వే స్టేషన్లు.. ఇలా జనాలు ఎక్కువగా ఉండేచోట- పిల్లల ద్వారా సానుభూతిని పొందుతూ బిచ్చమెత్తుకుంటున్నారు. మతపరమైన ప్రదేశాల్లో ఈ ముఠా దందా జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు.
ఇలాంటి వారికి దానాలు చేయొద్దని ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం ఉండట్లేదని పోలీసులు చెబుతున్నారు. చిన్నపిల్లలను చూసి జాలితో చాలా మంది వీరికి డబ్బులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర భారతదేశానికి చెందిన రాష్టాలలో ఈ దందా ఓ రేంజ్లో సాగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఈ దందాలను నిర్మూలించేందుకు సీసీబీ, ఏసీపీ రీనా సువర్ణ నేతృత్వంలోని బృందం ఆపరేషన్ నిర్వహించింది. దీనిలో భాగంగా బెంగళూరులో భిక్షాటన చేస్తున్న 31 మందిని ఈ బృందం అరెస్ట్ చేసింది.
అరెస్టైన వారిలో 10 మంది మహిళలు, 21 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వారందరినీ అనాథ శరణాలయానికి అప్పగించారు. అయితే పోలీసులు వీరిని ప్రశ్నించగా ఆ పిల్లలు అసలు తమ బిడ్డలు కాదని తెలిసింది. వేరే వాళ్ల పిల్లలను అద్దెకు తీసుకొచ్చి ఈ దందాలు చేస్తున్నట్లు తేలింది. కొంతమంది పిల్లల్ని అయితే స్మగ్లింగ్ ద్వారా ఎత్తుకొచ్చి బలవంతగా ఈ దందాలోకి దించినట్లు వెల్లడైంది. భిక్షాటన చేసే సమయంలో పిల్లలు ఏడవకుండా ఉండేందుకు వారికి మద్యం తాగిస్తున్నారు నిందితులు. దీంతో పిల్లలు మత్తెక్కి నిద్రలోకి జారుకుంటున్నారని పోలీసులు తెలిపారు. దీనిపై, మహిళా శిశు సంక్షేమ కమిటీ విచారణ జరుపుతోంది. చిన్నారులను ప్రశ్నిస్తోంది. పూర్తి విచారణ నివేదిక రాగానే బాధ్యులపై కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. కోర్టు అనుమతి పొందిన తర్వాత నకిలీ తల్లులు, పిల్లలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో భిక్షాటన నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఇది అమలు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు భిక్షాటన మాఫియాలో చిక్కుకున్న 1,220 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. బెంగళూరు నగరంలో దాదాపు 6 వేల మంది బిచ్చగాళ్లు ఉన్నట్లు సమాచారం. బిహార్, బంగాల్, అసోం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి పేద కుటుంబాలను కొంతమంది ఏజెంట్లు పని ఇప్పిస్తానని నమ్మించి నగరానికి తీసుకొస్తున్నారు. పేద తల్లిదండ్రులకు నెలకు కొంత డబ్బు ఇచ్చి వారి పిల్లలను తీసుకుంటున్నారు. వీరు ఈ పిల్లలను ముష్టిదందాల మహిళలకు ఇచ్చి కమీషన్లను తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:
శాంతి కాముకులా? వార్తాహరులా?.. జర్నలిస్టులంటే ఎవరు?
రైలులో ఇకపై నచ్చిన భోజనం.. పిల్లలకు, షుగర్ ఉన్నవారికి ప్రత్యేక మెనూ!