Azadi Ka Amrit Mahotsav treaty of amritsar: భారత్‌లో ఈస్టిండియా కంపెనీ పాలన ప్రాబల్యం పెరిగేనాటికి జమ్మూ కశ్మీర్ సిక్కు సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మహారాజా రంజిత్‌సింగ్ సారథ్యంలోని ఈ పంజాబ్ సామ్రాజ్యం అత్యంత పటిష్ఠమైంది. పశ్చిమాన అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ కనుమ నుంచి తూర్పున పశ్చిమ టిబెట్ దాకా; దక్షిణాన మిథాన్‌కోట్ (ప్రస్తుత పాకిస్థాన్‌లోనిది) ఉత్తరాన కశ్మీర్ దాకా విస్తరించి ఉండేది. లాహోర్ రాజధానిగా 1849 దాకా ఈ సామ్రాజ్యం కొనసాగింది. పాశ్చాత్యదేశాల తరహాలో బలమైన సైన్యాన్ని సమకూర్చుకున్నారు రంజిత్‌సింగ్. ఫ్రాన్స్, జర్మనీ, హాలండ్‌ల నుంచి యుద్ధనిపుణులను రప్పించి వారితో సైన్యానికి శిక్షణ ఇప్పించారు. బ్రిటిష్‌వారితోనూ సయోధ్య ఉండేది. వారికి పూర్తిగా లొంగిపోకుండా... అలాగని గొడవ పడకుండా సాగేది. ఈ క్రమంలో రంజిత్‌సింగ్ తిరుగులేని వీరుడిగా పాలన కొనసాగించారు. జమ్మూ డోగ్రా వంశానికి చెందిన గులాబ్‌సింగ్ 1810లో రంజిత్‌సింగ్ సైన్యంలో చేరాడు. తన బుద్ధి, భుజబలంతో రంజిత్‌సింగ్‌ను ఆకట్టుకున్నాడు. అంతేగాకుండా అఫ్గాన్ రాజుతో గొడవల్లో ఉన్న రంజిత్‌సింగ్‌కు అండగా నిలిచాడు. ప్రతిఫలంగా... జమ్మూ ప్రాంతరాజుగా 1822లో గులాబ్‌సింగ్‌కు స్వయంగా తిలకం దిద్దారు రంజిత్‌సింగ్. అలా సాగిన ఆ బంధం 1839లో రంజిత్‌సింగ్ మరణంతో మారిపోయింది.
రంజిత్‌సింగ్ మరణంతో సిక్కు సామ్రాజ్యంలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. వారసుల్లో ఒకరినొకరు చంపుకొని అంతా అస్తవ్యస్తంగా మారింది. ఇదే సమయమని ఆంగ్లేయులు దీన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. భారత్‌లో చివరగా ఆంగ్లేయుల వశమైన ప్రాంతం ఇదే. జమ్మూ రాజు గులాబ్‌సింగ్ ఈ సమయంలో ఈస్టిండియా కంపెనీ వైపు మొగ్గు చూపాడు. 1845-46 మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధంలో గులాబ్‌సింగ్‌తో పాటు అనేక మంది సిక్కు రాజులు ఆంగ్లేయులకు సాయం చేశారు. దీంతో సిక్కు సామ్రాజ్యం పాక్షికంగా ఈస్టిండియా కంపెనీకి తలవంచింది. కోటిన్నర రూపాయలు జరిమానా చెల్లించాలంటూ ఆంగ్లేయులు పట్టుబట్టారు. అంత సొమ్ము ఆ సమయానికి సిక్కు సామ్రాజ్య ఖజానాలో లేదు. 50 వేలు మాత్రమే ఉంది. ఫలితంగా... సిక్కు సామ్రాజ్యంలోని అనేక ప్రాంతాలను ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి కశ్మీర్! 1846 మార్చి 9న లాహోర్‌లో జరిగిన ఈ ఒప్పందంపై ఈస్టిండియా కంపెనీ తరఫున లార్డ్ హార్డింగ్, సిక్కు రాజ్యం తరఫున రంజిత్‌సింగ్ ఏడేళ్ల వారసుడు దులీప్‌సింగ్ సంతకాలు చేశారు.
ఆ తర్వాత వారం రోజులకే (మార్చి 16న) ఆంగ్లేయులు కశ్మీర్‌ను తమకు యుద్ధంలో సాయం చేసిన గులాబ్‌సింగ్‌కు రూ.75 లక్షలకు (సిక్కుసామ్రాజ్యంలో చలామణిలో ఉన్న నానక్‌షాహి రూపాయలు) అమ్మేశారు. అంతకుముందే గులాబ్ వద్ద ఉన్న జమ్మూతో కశ్మీర్‌ను కూడా కలిపి జమ్మూకశ్మీర్ రాజ్యాన్ని ఆంగ్లేయులు ఆవిష్కరించారు. ఈ మేరకు గులాబ్‌తో ఈస్టిండియా కంపెనీ చేసుకున్న ఒప్పందాన్ని అమృత్‌సర్ ఒప్పందంగా పిలుస్తారు. ఇందులో అనేక షరతులున్నాయి. రూ.75 లక్షలు ఇవ్వటంతోపాటు ఈస్టిండియా కంపెనీ అధికారానికి లోబడి ఉండాలి. అందుకు సూచికగా ఏటా గులాబ్‌సింగ్ సర్కారు ఆంగ్లేయులకు ఒక గుర్రాన్ని, 12 మేలుజాతి గొర్రెలను, మూడు కశ్మీరీ శాలువాలను ఇవ్వాలి. అవసరమైనప్పుడు ఆంగ్లేయులకు సైనిక సాయం అందించాలి. తన సరిహద్దులను రక్షించుకోవటంలో మహారాజా గులాబ్‌సింగ్‌కు కంపెనీ సహకరిస్తుంది. ఇలాంటి షరతులతో కొత్త జమ్మూకశ్మీర్‌ను ఆవిష్కరించిన ఆంగ్లేయులు 1848-49 రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత సిక్కు సామ్రాజ్యాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవటం తదనంతర చరిత్ర!
ఇదీ చదవండి: అమ్మాయిల వివాహ వయసు మార్పు వెనుక ఆ ఇద్దరు!