Azadi Ka Amrit Mahotsav Raj Guru: మహారాష్ట్రలోని ఖేడ్‌లో 1908 ఆగస్టు 24న జన్మించిన శివరామ్ హరి రాజ్‌గురు ఆరేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. ఇంటి బాధ్యతలు నెరవేర్చటానికి అన్నయ్య దినకర్ ఆంగ్లేయ సర్కారు ఉద్యోగిగా మారాడు. తమ్ముడు శివరామ్ రాజ్‌గురుకు మాత్రం.. మొదట్నుంచీ బ్రిటిష్ పాలనంటే పడేది కాదు. స్వాతంత్య్ర ఉద్యమం వైపు మొగ్గు చూపాడు. కాంగ్రెస్ సేవాదళ్ శిబిరానికి హాజరవటం మొదలెట్టాడు. తిలక్ మెచ్చిన శిష్యుడయ్యాడు. ఇది కుటుంబంలో విభేదాలు సృష్టించింది. ఇంట్లోంచి బయటకు వచ్చేసిన రాజ్‌గురు ఆకులు తింటూ పస్తులుంటూ.. కాశీ చేరుకున్నాడు. అక్కడ మహారాష్ట్రీయులు ఏర్పాటు చేసిన సంగవేద సంస్కృత కాలేజీలో సంస్కృత మాధ్యమ, తర్కశాస్త్రం నేర్చుకోవటానికి చేరాడు. పొట్ట కూటి కోసం పలు ఇళ్లలో భిక్షమెత్తుకోవటం.. చదువుకోవటం, వ్యాయామం చేయటం.. రోజువారీ కార్యక్రమం అయ్యింది. తన లక్ష్యం ఇది కాదనే సంగతి శివరామ్ రాజ్‌గురు మనసును తొలుస్తూనే ఉంది.
ఇంతలో మహారాష్ట్రకే చెందిన సావర్గావోంకర్ ద్వారా చంద్రశేఖర్ ఆజాద్ సారథ్యంలోని విప్లవసంస్థ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) దిశగా అడుగులు పడ్డాయి. అయితే అందులో చేరడం అంత సులభమేమీ కాలేదు. తెలియకుండానే రాజ్‌గురు అనేక పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలుత తనను అమరావతి (మహారాష్ట్ర)లోని హనుమాన్ వ్యాయామ ప్రసారక్ మండల్‌కు పంపించారు. ఇక్కడ మరింత రాటుదేలిన రాజ్‌గురు.. తుపాకీ పేల్చడంలోనూ తర్ఫీదు పొంది మళ్లీ కాశీ చేరుకున్నాడు. రాజ్‌గురులోని చురుకుదనం, స్వతంత్య్ర ఆలోచనలు, ఆంగ్లేయ పాలనపై ద్వేషం.. అతణ్ని హెచ్‌ఎస్‌ఆర్‌ఏకు దగ్గర చేశాయి. కాన్పుర్‌లో చంద్రశేఖర్ ఆజాద్‌తో భేటీ జరిగింది. తొలి భేటీలోనే రాజ్‌గురు భావజాలం, నిజాయతీ నచ్చిన ఆజాద్ తన బృందంలో చేర్చుకున్నారు.
రాజ్‌గురుకు రఘునాథ్ అని కొత్త పేరు పెట్టారు. అలా.. ఆంగ్లేయులపై పోరాటం చేయాలన్న కల నిజమవటం మొదలైంది. గురితప్పని షూటింగ్ నైపుణ్యం కారణంగా కొద్దిరోజుల్లోనే రాజ్‌గురు హెచ్‌ఎస్‌ఆర్‌ఏలో కీలకమయ్యాడు. భగత్‌సింగ్‌తో బంధం బలపడింది. సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో జేమ్స్ స్కాట్ అనే పోలీసు దెబ్బలకు లాలా లజపత్‌రాయ్ మరణించటం లాహోర్ విప్లవవీరులందరినీ కలచివేసింది. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆజాద్, సుఖ్‌దేవ్, భగత్‌సింగ్, జైగోపాల్‌లతో పాటు రాజ్‌గురు అందులో సభ్యులు. లాలాను కొట్టిన ఆంగ్లేయ అధికారిని గుర్తించి సంకేతం ఇవ్వటం జైగోపాల్ వంతు. గురి తప్పకుండా కాల్చటం రాజ్‌గురు పని. మిగిలినవారు వెనకాల నుంచి మద్దతు. జైగోపాల్ జాన్ శాండర్స్‌నే స్కాట్ అనుకొని పొరపాటున సంకేతం ఇవ్వటంతో రాజ్‌గురు కాల్చేశాడు. గుండు శాండర్స్ గుండెల్లో దిగింది. పొరపాటు గుర్తించిన భగత్ వెంటనే వెనకాల్నుంచి వచ్చి.. మరోరెండు రౌండ్లు కాల్చగానే వేగంగా అంతా పారిపోయారు. చాలాకాలం తర్వాత దిల్లీలోని అసెంబ్లీలో బాంబు పెట్టి భగత్‌సింగ్ పట్టుబడ్డాడు.
శాండర్స్‌పై దాడి తర్వాత రాజ్‌గురు గుప్‌చుప్‌గా అమరావతి వచ్చేశాడు. మళ్లీ వ్యాయామశాలలో చేరాడు. కానీ అక్కడ ఆంగ్లేయ గూఢచారులున్నట్లు అనుమానం వచ్చి.. పుణె వెళ్లి కుటుంబంతో కలిశాడు. అక్కడే తన కాశీ స్నేహితుడు సావర్గావోంకర్‌తో కలసి బొంబాయి గవర్నర్‌ను చంపటానికి ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలోనే జాతీయ కాంగ్రెస్ నాయకుడు శరద్ కేస్కర్‌తో పరిచయమైంది. పైకి కాంగ్రెస్ నాయకుడిగా ఆంగ్లేయులపై పోరాటం చేస్తున్నట్లుండే శరద్.. నిజానికి వారి గూఢచారి. ఈ విషయం తెలియని రాజ్‌గురు.. తనను నమ్మి ప్రణాళిక చెప్పేశాడు. ఇంతలో లాహోర్ నుంచి రాజ్‌గురును గుర్తుపట్టడానికి జైగోపాల్‌ను పుణె పట్టుకొని వచ్చారు బ్రిటిష్ పోలీసులు. శరద్ ద్వారా.. రాజ్‌గురు చుట్టూ ఉచ్చుబిగించారు. గవర్నర్‌ను చంపటానికి రప్పించి.. అరెస్టు చేశారు. పుణె నుంచి లాహోర్‌కు తీసుకెళుతుంటే.. అన్ని స్టేషన్లలోనూ రాజ్‌గురును చూడటానికి జనం ఎగబడ్డారు. అరెస్ట్ అయ్యాననే బాధ ఏమాత్రం లేకుండా దేశభక్తి గీతాలు పాడుతూ.. అందరినీ ఉత్సాహపరిచాడు రాజ్‌గురు. 1931 మార్చి 23 ఉదయం.. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్‌లతోపాటు రాజ్‌గురును ఆంగ్లేయ సర్కారు ఉరితీసింది. "సాధించినదానితో సంతృప్తి పడుతున్నా. మా జీవితాలను త్యాగం చేయటం ద్వారా కించిత్తైనా స్వాతంత్య్ర భావన నా దేశవాసుల్లో కలిగితే చాలు.. ఇక 'దారులు' పడ్డట్లే! అలాంటి దారి చూపిన మరణం.. మాకు వరంలాంటిది" అంటూ మృత్యు ఒడిలో ఒదిగే నాటికి రాజ్‌గురు వయసు.. 22 సంవత్సరాలు మాత్రమే!
ఇదీ చదవండి: చదువుకున్న కుర్రాడని గాలం వేస్తే.. చుక్కలు చూపించాడు!