Azadi ka Amrit Mahotsav: 1893 ఏప్రిల్‌లో సూటూబూటూ వేసుకొని.. తెల్లదొరలా తయారై... ముంబయిలో ఫస్ట్‌క్లాస్ టికెట్‌తో ఓడెక్కే సమయానికి... గాంధీ ఓ విఫల న్యాయవాది. ముంబయి కోర్టులో నిలవలేక... రాజ్‌కోట్‌లో అత్తెసరు సంపాదనతో గడపలేక ... కొలువు వెతుక్కుంటూ దక్షిణాఫ్రికాకు ప్రవాసం బయల్దేరిన 23 ఏళ్ల భారతీయ యువకుడు!
1915 జనవరి 9న... ముంబయిలో అడుగుపెట్టే సమయానికి... సంప్రదాయ ధోవతీ, తలపాగా ధరించి... మూడో తరగతి టికెట్‌తో ప్రయాణించి... గోఖలే, జిన్నా, టాటాలతో పాటు... దారిపొడవునా బారులు తీరిన ప్రజల జిందాబాద్‌లు అందుకున్న ఆశాకిరణం! తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే వల్ల దక్షిణాఫ్రికాలో గాంధీజీ విజయాలు, ప్రయోగాల గురించి అప్పటికే భారత్‌లో ప్రచారం జరిగింది. ఆయన పట్ల ఆసక్తి పెరిగింది. దాదాపు 25 సంవత్సరాలు విదేశాల్లోనే గడిపిన గాంధీజీ స్వదేశానికి తిరిగివచ్చేనాటికి వయసు... 45 ఏళ్లు!
అప్పటికల్లా భారత్‌లో జాతీయోద్యమం ఆందోళనలకు ఎక్కువ... ఉద్యమానికి తక్కువ అనే స్థితిలో ఊగిసలాడుతోంది. లక్ష్యంపైనా, లక్ష్యసాధనపైనా కాంగ్రెస్‌లోని అతివాదులు, మితవాదుల వాదోపవాదనలు.. మరోవైపు విప్లవవాదుల ప్రయత్నాలు... బ్రిటిష్ విభజన ఎత్తుగడలు, ముస్లింలీగ్ ఏర్పాటు మధ్య... ఒక్కతాటిపై నిలబెట్టే నాయకత్వం లేక... భారతావని చుక్కాని లేని నావలా కొట్టుమిట్టాడుతోంది. అలాంటి సమయంలో దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ప్రయోగాలతో తెల్లవారిపై విజయాలు సాధించిన గాంధీజీ... ఓ ఆశాకిరణంలా అగుపించాడందరికీ! ఏం చేస్తాడో తెలియకున్నా... ఏదో చేస్తాడనే ఆశ! అందుకే మితవాదులు, అతివాదులు, హిందువులు, ముస్లింలు, పార్శీలు... మహిళలు, యువకులు... ఇలా అన్ని మతాలు, వర్గాలూ నమ్మకంతో గాంధీకి ఘన స్వాగతం పలికాయి.
రాజులు, వైస్రాయ్‌లు, ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే పరిమితమైన ... అపోలో బందర్ పోర్టులో గాంధీజీ దిగటానికి అనుమతిచ్చారు. సెలబ్రిటీలను ఊరేగించే కారులో... ఆయన్ను ముంబయి వీధుల్లో తీసుకెళుతుంటే దారి పొడవునా ప్రజలు ఆయనపై పూలవర్షం కురిపించారు. తర్వాత చాలారోజుల పాటు రోజూ... ఆయన గౌరవార్థం విందులు, సభలు ఏర్పాటయ్యాయి. జిన్నా ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశానికి వచ్చినవారైతే ఏకంగా... దక్షిణాఫ్రికాలో ఆయన చేసిన పనులను ఏకరువు పెట్టి... బంగారు బేడీలు ప్రదానం చేశారు. వాటిని అక్కడికక్కడే వేలం వేశారు గాంధీజీ.
"భారత్‌లో ఉండిపోవటానికనే వచ్చా. కానీ ఏం చేస్తానో నాకే తెలియదు. నా మాతృదేశమే అయినా అపరిచిత దేశానికి అపరిచితుడిలా వచ్చినట్లుంది" అన్నారు గాంధీ!
నోరు మూసుకొని...
భారత్‌కు రాకముందే... గోఖలేతో గాంధీజీకి పరిచయముంది. గోఖలే దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు గాంధీజీ అక్కడ సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తున్నారు. అలా... ఆయనలో ముందే భావి భారత మార్గదర్శకుడిని చూశారు గోఖలే! అలాగని భారత్‌కు రాగానే జాతీయోద్యమ పగ్గాలు చేపట్టమని కోరలేదు. సన్మానాల్లో, సమావేశాల్లో, ప్రసంగాల్లో మునిగి తేలుతున్న గాంధీకి ఆయనిచ్చిన సలహా...
"నీకు చాలా ఆలోచనలు ఉండొచ్చు. కానీ కొద్దిరోజులు ప్రసంగాలు మానెయ్. ప్రజల ప్రశ్నలకు జవాబులివ్వటం మానెయ్. నోరుమూసుకొని... చెవులు తెరచుకొని... మొదట దేశమంతా పర్యటించు. బాగా గమనించు" అని!
గోఖలేను రాజకీయ గురువుగా, స్ఫూర్తి ప్రదాతగా, పెద్దన్నగా గౌరవించిన గాంధీజీ అలాగేనంటూ మాటిచ్చారు. మనసు పరచుకొని యావద్దేశం చుట్టివచ్చారు. మహాత్ముడిలా ఎదిగారు. జాతీయోద్యమానికి కొత్త రూపురేఖలద్దారు.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: స్వయంపాలన కాదు.. సంపూర్ణ స్వరాజ్యం కోసం..!