Azadi Ka Amrit Mahotsav Chittaranjan Das: సంపన్న న్యాయకోవిదుల కుటుంబంలో 1870 నవంబరు 5న పుట్టిన చిత్తరంజన్‌దాస్ ఆంగ్లేయ విద్యలో ఆరితేరారు. కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నాక తండ్రి కోరిక మేరకు ఐసీఎస్ కోసం లండన్ వెళ్లారు. అదే సమయానికి.. బ్రిటన్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. భారతీయులను సమర్థిస్తున్న లిబరల్ పార్టీ తరఫున చిత్తరంజన్ దాస్ ప్రచారంలో పాల్గొన్నారు. భారత్ హక్కుల గురించి ప్రసంగించారు. ఇది గమనించిన ఆంగ్లేయ సర్కారు.. చిత్తరంజన్‌ను ఐసీఎస్ పరీక్షలో ఫెయిల్ చేసింది. వెంటనే ఆయన అక్కడే న్యాయశాస్త్రం చదివి వచ్చి.. 1894 నుంచి కలకత్తాలో క్రిమినల్ లాయర్‌గా వృత్తి చేపట్టారు.
Chittaranjan Das Biography: ఆదిలోనే గట్టి కేసులు నెగ్గటంతో చిత్తరంజన్ వృత్తిలో త్వరగా స్థిరపడ్డారు. వందేమాతరం, అలీపుర్ బాంబు కేసుల్లో అరబిందో ఘోష్ తరఫున ఆయన వాదనకు ఆంగ్లేయ న్యాయమూర్తులు ఫిదా అయ్యారు. తర్వాత కొన్ని కీలకమైన కేసుల్లో.. ఆంగ్లేయ సర్కారు అప్పటి బెంగాల్ అడ్వకేట్ జనరల్ గిబ్బన్ కంటే ఎక్కువ ఫీజు ఇచ్చి ప్రభుత్వం తరఫున వాదించటానికి చిత్తరంజన్‌ను పెట్టుకుంది. దీంతో లాయర్‌గా ఆయన పేరు మారుమోగిపోయింది. కలకత్తాలోని సంపన్న కుటుంబాల జాబితాలో ఆయనా చేరిపోయారు. సౌకర్యాలెంతగా పెరిగాయంటే.. ఆయన దుస్తుల్ని పారిస్‌లో కుట్టించేవారంటే ఆయన జీవనమెంత విలాసంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వృత్తిలో ఎంతగా ఎదుగుతున్నా భారత స్వాతంత్య్ర ఉద్యమానికి పరోక్షంగా సాయం చేశారు.
1917లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు చిత్తరంజన్. బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ సదస్సులో.. స్థానిక పాలన, సహకార సొసైటీలు, కుటీర పరిశ్రమల పునరుద్ధరణ ద్వారా గ్రామీణ పునర్‌నిర్మాణ పథకాన్ని ప్రతిపాదించారు. తన ఆలోచనలు, వాగ్ధాటితో గాంధీజీని ఆకర్షించారు. న్యాయవాద వృత్తిని వదిలేసి జాతీయోద్యమంలో భాగమయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న చిత్తరంజన్ స్వరాజ్య నినాదాన్ని బలంగా వినిపించారు. అయితే.. ఇంట్లో సంపన్నమైన జీవితం గడుపుతూ స్వదేశీ నినాదం ఇవ్వటం ఎబ్బెట్టుగా ఉంటుందని భావించి.. వెంటనే తన విదేశీ దుస్తులన్నింటినీ కాల్చేసి ఖద్దరు తొడగటం మొదలెట్టారు.
అంతటితో ఆగకుండా తన ఆస్తులను, సంపదనంతటినీ జాతీయోద్యమం కోసం దానం చేసి.. పేదరికాన్ని ఆహ్వానించారు. ప్రజలు ఆయన్ను.. తమ ఆత్మబంధువుగా భావించి.. దేశబంధు బిరుదిచ్చి ఆదరించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో అరెస్టయి ఆరునెలలు జైలుకెళ్లారు. ఇంతలో చౌరీచౌరా సంఘటన నేపథ్యంలో గాంధీజీ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపేశారు. ఇది చిత్తరంజన్‌కు ఏమాత్రం నచ్చలేదు. ఆ విషయాన్నే నిర్మొహమాటంగా గాంధీజీకి చెప్పారు కూడా!
బయటి నుంచి పోరాడటంతోపాటు పాలనలో భాగమై ఆంగ్లేయులకు పొగబెట్టాలని.. ఇందుకోసం ఎన్నికల్లో పాల్గొనాలని చిత్తరంజన్ భావించారు. 1922 గయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన ఈ ప్రతిపాదనను అందరి ముందుంచారు. కానీ గాంధీ అనుచరులు దీనితో ఏకీభవించలేదు. మొత్తానికి తన ప్రతిపాదన వీగిపోవటంతో చిత్తరంజన్ కాంగ్రెస్‌లో అంతర్భాగంగానే 1923లో మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్య పార్టీని స్థాపించారు. 1923 మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి చిత్తరంజన్ దాస్ కలకత్తా తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. సుభాష్ చంద్రబోస్ ఆయనకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (నేతాజీకి రాజకీయ గురువు చిత్తరంజన్ దాసే.)
1924 లెజిస్లేటివ్ ఎన్నికల్లో స్వరాజ్య పార్టీ పోటీ చేసి మంచి సీట్లే సాధించింది. బెంగాల్‌లో జనాభాపరంగా అధికసంఖ్యలో ఉన్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేయాలని చిత్తరంజన్ ప్రతిపాదించారు. ఈమేరకు బెంగాల్ ముస్లిం నేతలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్నే 1923 బెంగాల్ ఒప్పందం అంటారు. తద్వారా ఆంగ్లేయులు పెట్టిన మతచిచ్చును ఆర్పవచ్చని ఆయన భావించారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటు బెంగాల్ ముస్లిం రాజకీయ నేతలూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించటం గమనార్హం. అయినా పట్టుదలతో తన నాయకత్వంలోని స్వరాజ్య పార్టీతో ఈ ఒప్పందాన్ని అమలు చేయించారు చిత్తరంజన్. 1926లో ఇది రద్దయింది. చిత్తరంజన్ జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. 1925లో అనారోగ్యం పాలైన ఆయన.. డార్జిలింగ్‌లో చికిత్స పొందుతూ.. 55వ ఏట జూన్ 16న కన్నుమూశారు. మహాత్మాగాంధీ స్వయంగా వచ్చి.. ఆయన అంతిమయాత్రను నిర్వహించారు.
ఇదీ చదవండి: 'ఎవరెస్ట్' అంత పేరునూ దోచేసి.. భారతీయుడి ఖ్యాతిని కొల్లగొట్టి..