అసోం మాజీ సీఎం కన్నుమూత- ప్రముఖులు దిగ్భ్రాంతి..
అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయి (84) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గువాహటిలోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. గత నెలలో కరోనా బారిన పడిన ఆయన.. ఈ మహమ్మారి నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో శరీరంలోని అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తరుణ్ గొగొయి మూడు పర్యాయాలు అసోం సీఎంగా, ఆరు సార్లు ఎంపీగా సేవలందించారు.
ప్రముఖుల సంతాపం..
గొగొయి మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, అసోం ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
- తరుణ్ గొగొయి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఆయన మరణం.. ఓ శకం ముగింపును సూచిస్తుందని ట్వీట్ చేశారు. గొగొయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో అనేక సంవత్సరాల అనుభవమున్న నేతను కోల్పోవడం తనను కలచివేసిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గొగొయి కుటుంబసభ్యులు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- తరుణ్ గొగొయి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. రాష్ట్రానికి గొగొయి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. రాష్ట్రం ఓ గొప్ప నేతను కోల్పోయిందని.. ఆయన రాజకీయాల్లో ప్రత్యేక వ్యక్తిగా నిలిచిపోతారని ట్వీట్ చేశారు.