అసోం దరాంగ్ జిల్లా ధోల్‌పుర్‌లో పోలీసులపై దాడుల(Assam Clashes) వెనుక అతివాద ఇస్లామిస్ట్ గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంతబిశ్వ శర్మ(Himanta Biswa Sarma) ఆరోపించారు. ఇందుకు సంబంధించి పలు ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. పౌరులపై పోలీసులు కాల్పులు జరుపుతున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా.. వాటిపైనా స్పందించారు. పరిస్థితిని మొదటి నుంచి చూపిస్తే అక్కడ జరిగిన వాస్తవాలు బయటపడి ఉండేవని పేర్కొన్నారు.
'అక్రమంగా ఏర్పాటైన నివాసాలను తొలగించకుండా ప్రభుత్వంతో మంతనాలు చేస్తామంటూ ఓ గ్రూప్ స్థానిక పేద ప్రజల వద్ద కొన్ని నెలల క్రితం రూ.28 లక్షలు వసూలు చేసింది. ప్రభుత్వ డ్రైవ్‌ను అడ్డుకోలేకపోయిన సదరు గ్రూప్.. ప్రజలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించింది. ఇందులో ప్రమేయం ఉన్న ఆరుగురు వ్యక్తుల పేర్లు మా వద్ద ఉన్నాయి' అని సీఎం తెలిపారు. ఘటన జరిగిన ముందు రోజు.. ఆహార పదార్థాలు సరఫరా చేసే నెపంతో పీఎఫ్‌ఐ(PFI Assam) సభ్యులు ధోల్‌పుర్ ప్రాంతాన్ని సందర్శించినట్లు సీఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. పీఎఫ్‌ఐని పూర్తిగా నిషేధించాలని కోరుతూ అస్సాం ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఓ పత్రాన్ని సమర్పించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఏర్పాటైన నివాసాలను తొలగించేందుకు అస్సాం అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ గురువారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ధోల్‌పుర్ గ్రామంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. స్థానికులు రాళ్లు, కర్రలు విసరడంతో 9మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం శుక్రవారం హిమాంత బిశ్వ శర్మ(Assam CM) స్పందించారు. 10వేల మందికి పైగా ప్రజలు పోలీసులను అడ్డుకొని వారిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: