జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమానికి సంబంధించి భారత సైన్యం తన ప్రామాణిక నిర్వహణ విధానా (ఎస్‌వోపీ)ల్లో మార్పు చేపట్టింది. ఉగ్రవాదులతో భీకర పోరాటం జరిగే సమయంలోనూ.. ఆ ముష్కరుల్లో పరివర్తనకు ప్రయత్నించాలని నిర్ణయించింది. వారికి నచ్చజెప్పి, లొంగిపోయేలా చూసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించుకుంది. ఈ విధానంలో సైనికుల ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ.. దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం సైన్యంలోని విక్టర్ ఫోర్స్‌లో పనిచేస్తున్న నాలుగు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లకు సైన్యాధిపతి నుంచి 'యూనిట్ సైటేషన్ పురస్కారం' లభించింది. దక్షిణ కశ్మీర్‌లో ఈ దళాలు అనేక ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఏడుగురు ఉగ్రవాదులు లొంగిపోయేలా చేశాయి. ఇవన్నీ ఎన్‌కౌంటర్ స్థలంలోనే జరిగాయి. ఉగ్రవాదుల తూటాల నుంచి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ సాహసోపేతంగా.. ముష్కరుల తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ ప్రదేశానికి తీసుకొచ్చారు. వారి సాయంతో నచ్చజెప్పి, ఉగ్రవాదులు లొంగిపోయేలా చేశారు. దీనివల్ల స్థానికుల్లోనూ సానుకూల వాతావరణం ఏర్పడిందని విక్టర్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ రషీమ్ బాలీ తెలిపారు. గత ఏడాది ఒక ఎన్‌కౌంటర్ సమయంలో అల్ బాదర్ ఉగ్రవాద ముఠా సభ్యుడు షోయబ్ అహ్మద్ భట్ అనే ముష్కరుడి లొంగుబాటుతో ఈ కార్యక్రమం మొదలైనట్లు చెప్పారు.
తగ్గుతోన్న ఉగ్రవాదుల సంఖ్య..!
జమ్మూ-కశ్మీర్‌లో భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ 270 మందికి ముష్కరులే క్రియాశీలంగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2020లో ఉగ్రవాదుల చొరబాట్లు, పౌరహత్యలు కూడా తగ్గినట్లు తెలిపాయి. గతేడాది 100 ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టి ముష్కరుల సంఖ్యను తగ్గించినట్లు వెల్లడించాయి. గతేడాది 635 మంది ముష్కరులను అరెస్టు చేసినట్లు జమ్మూ-కశ్మీర్ పోలీస్ అధిపతి దిల్బాగ్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: విదేశీ వలసల్లో భారత్ టాప్: యూఎన్