రాజస్థాన్‌లోని ఓ ఇంటిపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-21 కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. పైలట్ మాత్రం పారాష్యూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పైలట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
హనుమాన్‌ఘఢ్ జిల్లాలోని బహ్లోల్‌నగర్ గ్రామంలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కూలింది. సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్ నుంచి ఈ యుద్ధ విమానం బయలుదేరిందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. రోజూవారీ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కొంతసేపటికే.. విమానం కూలిపోయినట్లు వారు వెల్లడించారు. విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తి అదుపు తప్పడాన్ని గుర్తించిన పైలట్.. ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. అయితే అది వీలు కాకపోవడం వల్ల ప్రాణనష్టాన్ని తప్పించేందుకు.. యుద్ధవిమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో కూల్చేందుకు యత్నించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు జరిపేందుకు భారత వాయుసేన విచారణకు ఆదేశించింది. అనంతరం మృతుల కుటుంబాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
కూలిన ఆర్మీ హెలికాప్టర్.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..
నాలుగు రోజుల క్రితం జమ్ము కశ్మీర్‌లోనూ ఓ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కిష్త్వార్ జిల్లాలో సైన్యానికి చెందిన ALH ధ్రువ్ చాపర్.. ప్రమాదానికి గురై మరువా నది ఒడ్డున నేలను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో పైలట్, కో పైలట్, టెక్నీషియన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందున్న అధికారులు వెంటనే సహాయక చేపట్టి.. క్షతగాత్రుల్ని ఉధంపుర్లోని ఆస్పత్రికి తరలించారు. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య కారణంగానే హెలికాప్టర్ కూలిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆర్మీ హెలికాప్టర్ కూలి ఇద్దరు మృతి..
అంతకుముందు భారత సైన్యానికి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. మార్చి 16న అరుణాల్ ప్రదేశ్‌లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మరణించిన పైలట్లను లెఫ్ట్‌నెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ ఎ. జయంత్‌గా గుర్తించారు. అయితే లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారుగా తెలిసింది. ఆయన భార్య కూడా ఆర్మీలోనే దంత వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్ననట్లు సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.