ఆయుధాలతో కూడిన ఓ పార్సిల్‌ను (Arms Recovery) అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్థాన్ నుంచి అక్రమంగా డ్రోన్ ద్వారా జమ్ములోని వ్యక్తులకు చేరవేసే క్రమంలో జారిపడి ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న పార్సిల్ నుంచి ఏకే అసాల్ట్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రౌండ్ల బులెట్లు, ఒక టెలిస్కోప్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాక్ నుంచి ఈ ఆయుధాలను డ్రోన్ ద్వారా తరిలించినట్లు భావిస్తున్నారు. అయితే వీటికి సంబంధించిన సమాచారాన్ని అంతర్జాతీయ సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫలైన్ మండలంలోని సౌంజనా గ్రామానికి చెందిన వ్యక్తి అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామాన్ని అధీనంలో తీసుకుని సెర్చ్ ఆపరేషన్లను ప్రారంభించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇందులో భాగమైన వారిని గుర్తించేపనిలో పడ్డారు. ఏడాది కాలంగా జమ్ముకశ్మీర్‌లో ఇలాంటి డ్రోన్లను భారీగా కూల్చివేశాయి మన బలగాలు.
ఉగ్రదాడిలో మరో వ్యక్తి మృతి..
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని బటమాలూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో (Militant Attack) గాయపడిన పౌరుడు చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో మహ్మద్ షఫీదార్ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. శనివారం జరిగిన ఈ కాల్పుల్లో మాజిద్ అహ్మద్ గోజ్రీని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఇదీ చూడండి: 'డ్రగ్స్ పార్టీ'పై దాడులు- పట్టుబడ్డ స్టార్ హీరో కుమారుడు!