Police Custody of Saikrishna in Apsara Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సరూర్‌నగర్ అప్సర హత్య కేసులో రోజుకో విషయం వెలుగు చూస్తోంది. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసిన ప్రియురాలిని హతమార్చిన ఘటనలో నిందితుడు సాయికృష్ణను శంషాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు అతడిని రెండు రోజులు కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు నిందితుడు సాయికృష్ణను గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఇవాళ రాత్రి నిందితుడిని.. హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. తద్వారా అప్సర హత్య గురించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శనివారం మధ్యాహ్నంతో నిందితుడు సాయికృష్ణ కస్టడీ ముగియనుంది.
Apsara Murder Case Scene Reconstruction : తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసిన అప్సరను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న పూజరి సాయికృష్ణ.. ఈ నెల 4న ఉదయం 3.30 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని నర్కుడలో ఆమెను హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని ఓ సెప్టిక్ ట్యాంకులో వేసి కాంక్రీటుతో మూసేశాడు. అప్సర ఏమైందని సాయికృష్ణని ఆమె తల్లి ప్రశ్నించగా.. స్నేహితులతో భద్రాచలం వెళ్లిందని చెప్పాడు.
Saroornagar Apsara Murder News : రెండు రోజులైనా అప్సర ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లికి తనపై అనుమానం రాకుండా 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు. రాత్రి 10.20 గంటలకు అప్సరను శంషాబాద్ బస్టాండు దగ్గర ఆమె స్నేహితుల కారులో పంపించానని.. ఆ తర్వాత నుంచి అదృశ్యమైందని ఫిర్యాదులో రాశాడు. అప్సర అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన బాధ్యతలను ఎస్సై భానుమతి తీసుకున్నారు. ప్రాథమిక వివరాల కోసం చివరిసారిగా కలిసిన పూజారి సాయికృష్ణను విచారించారు. అతని ప్రవర్తనపై ఆమెకు అనుమానం రావడంతో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మేరకు శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని వందలాది సీసీ కెమెరాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.
Saroornagar Apsara Murder Case : ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటలకు రాళ్లగూడలోని ఓ ఫాస్ట్‌పుడ్ హోటల్ దగ్గర అప్సరతో కలిసి నిందితుడు సాయికృష్ణ భోజనం చేసిన దృశ్యాలను గుర్తించారు. నిందితుడి ఫిర్యాదును మరోసారి పరిశీలించగా.. రాత్రి 10.20 గంటలకు కారులో వెళ్లినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు. అనుమానంతో సాయికృష్ణను పిలిచి ఆరా తీయగా తనకు సంబంధం లేదని బుకాయించాడు. దాంతో ఇద్దరు కలిసి భోజనం చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను నిందితుడికి చూపించారు. పూజారి సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆరోజు సంచరించిన ప్రాంతాల వివరాలు అన్ని సేకరించి అతని ముందుంచారు.
Hyderabad Apsara Murder Case Updates : ఆధారాలను చూపిస్తూ మరింత గట్టిగా ప్రశ్నించగా.. పూజారి సాయికృష్ణ నిజాన్ని అంగీకరించాడు. అప్సరను హత్య చేసి ఆ మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో వేసినట్లు తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో నమోదైన యువతి అదృశ్యం కేసును.. హత్య కింద నమోదు చేసి ఈ నెల 9న సాయికృష్ణని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్సరను హత్య చేసిన ప్రాంతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండడంతో ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు. కాగా.. అప్సర హత్య కేసు వివరాలను లోతుగా విచారించడానికి నిందితుడిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టులో శంషాబాద్ పోలీసులు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: