Anti-drugs soldier Program in Telangana : మాదక ద్రవ్యాల సరఫరా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది. మత్తు పదార్థాల కట్టడికి యువతలో అవగాహన కల్పించేందుకు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కలిసి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మత్తు పదార్థాలపై నిఘాతో పాటు నియంత్రణపై యువతను భాగస్వాములు చేసేలా 'యాంటీ డ్రగ్స్ సోల్జర్' పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అన్ని విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు ఇందుకోసం పని చేస్తున్నాయి.
Drug Addicts in Hyderabad : పోలీసులు నిఘా ఉంచి.. సరఫరాదారులు, వినియోగదారులను అడ్డుకునే వరకు చూడకుండా.. ప్రజలు ఇచ్చే సమాచారంతో ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు వీలుగా కార్యక్రమాన్ని రూపొందించారు. డ్రగ్స్ నిరోధానికి యువత కూడా భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పని చేస్తున్నాయి.
మత్తు పదార్ధాల ముఠాల్లో అధిక శాతం మంది వాటిని వినియోగిస్తున్న వారే స్మగ్లర్లుగా మారిపోతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలకు బానిసలైన తర్వాత డబ్బులు సరిపోక కొందరు సరఫరాదారులుగా అవతారమెత్తుతున్నారు. మరికొందరు కమీషన్‌కు కక్కుర్తి పడి స్మగ్లర్లతో కుమ్మక్కవుతున్నారు. పోలీసులకు పట్టుబడ్డ సినీ నిర్మాత కేపీ చౌదరి.. సినిమా, హోటల్ వ్యాపారంలో నష్టాలు రావడంతో కొకైన్ విక్రయం ప్రారంభించాడు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ తరహా ముఠాలతో పాటు వినియోగదారులపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
''మాదకద్రవ్యాల సమస్య దేశవ్యాప్తంగా విస్తరించింది. నార్కోటిక్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన రావడం ముఖ్యం. భవిష్యత్తులో అన్ని ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేస్తాం.'' - సీపీ సీవీ ఆనంద్
ఈ నేపథ్యంలో 2022లో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 479 కేసుల్లో 1,127 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అత్యధికంగా హైదరాబాద్ పోలీసులు 932 డ్రగ్స్ వినియోగదారులపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్‌లో 195 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ పోలీసులు గత ఏడాది 94 మంది డ్రగ్స్ సరఫరాదారులపై పీడీ యాక్టు నమోదు చేశారు. మత్తు పదార్థాల నిరోధం, నియంత్రణపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులే కాకుండా పౌరులందరూ భాగస్వాములైతే వీటిని కట్టడి చేయవచ్చని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి..
Kabali Producer Drugs Case Update : కేపీ చౌదరి డ్రగ్స్ కేసు.. 'టాలీవుడ్'లో టెన్షన్.. టెన్షన్..!
Hero Nikhil on Drugs : 'డ్రగ్స్ తీసుకోమని నన్ను చాలా మంది అడిగారు'