Cheetah Died In Kuno : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మరణించింది. 3 రోజుల క్రితమే తేజస్ అనే మగ చీతా మృత్యువాతపడగా.. శుక్రవారం ఉదయం 9గంటలకు సూరజ్ అనే మరో మగ చీతా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. సూరజ్ మరణంతో 4 నెలల్లో మృతి చెందిన ఆఫ్రికన్ చీతాల సంఖ్య 8కి చేరింది. సూరజ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
Cheetah Died Recently : దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన తేజస్ చీతా ఆడ చీతాతో తలపడి మెడపై గాయాలై చనిపోయినట్లు గుర్తించారు. మార్చి 27న, సాషా అనే ఆడ చీతా కిడ్నీ వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 23న, ఉదయ్ అనే చీతా కార్డియో-పల్మనరీ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. మే 9న, దక్ష అనే ఆడ చీతా సంభోగ సమయంలో గాయపడి చనిపోయింది. ఆ తర్వాత 2 చీతా కూనలు డీహైడ్రేషన్‌కు గురై మరణించాయి. అనంతరం మరో చీతా కూన చనిపోయింది.
జైరాం రమేశ్ విమర్శలు..
కునో నేషనల్ పార్క్‌లో గత నాలుగు నెలల వ్యవధిలో ఎనిమిది చీతాలు మరణించిన నేపథ్యంలో కేంద్రంపై.. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విరుచుకుపడ్డారు. 'ఈరోజు అందరూ చంద్రయాన్-3 ప్రయోగం సఫలం అవ్వడం వల్ల ఆనందంగా ఉన్నారు. ఈ శుభ సందర్భంలో కునో నేషనల్ పార్క్‌లో చీతా చనిపోయిందని వార్త వచ్చింది. నిపుణుల బృందం చీతాల పెంపకంలో తప్పు జరుగుతోందని పదేపదే చెబుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' అని విమర్శంచారు.
7 దశాబ్దాల తర్వాత..
Project Cheetah 2022 : భూమి మీద అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు చీతా. ఇవి భారత్‌లో 74 ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్‌లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల.. విదేశాల నుంచి చీతాలను పలు దఫాలుగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద గతేడాది సెప్టెంబర్‌లో ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా.. నమీబియా నుంచి 8 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వీటిలో 7 మగ, 5 ఆడ చీతాలు ఉన్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.