Ambati Rayudu Political Entry News: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధపడ్డారు. రాజకీయాల్లో ఎంట్రీపై ఆయన ఓ క్లారిటీ ఇచ్చేశారు. త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించారు. గ్రామీణ ప్రజల సమస్యలు.. వారి అవసరాలు తెలుసుకొని వాటిలో ఏ పనులు చేయగలను.. ఏ అవసరాలు తీర్చగలను అనే అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. ముందుగా ప్రజానాడి తెలుసుకొనేందుకే గ్రామాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తెలియజేస్తామన్నారు.
నిన్న గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరులోని పునీతసౌరి చర్చిలో రాయుడు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆ చర్చికి సంబంధించిన పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి మధ్యాహ్న భోజనం తిన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల అభివృద్ధికి సంబంధించి కొన్ని సమస్యలను అంబటి రాయుడికి వివరించారు. ఎయిడెడ్ పాఠశాల కావడం వల్ల ప్రభుత్వం నిధులు రావడం లేదని అయితే విద్యార్థులకు అందాల్సిన మధ్యాహ్నం భోజన పథకం, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాలు అయితే అమలవుతున్నాయని.. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన రాయుడు.. పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు.
తేల్చేసిన అంబటి రాయుడు: అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై వార్తలు ఏవిధంగా వైరల్ అయ్యాయో.. ఇప్పుడు ఆయన చేరబోయే పార్టీపై కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంబటి.. వైఎస్సార్సీపీలోకి చేరతారానే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఎందుకుంటే.. ఈ మధ్య కాలంలో పలు సందర్భాల్లో సీఎం జగన్‌ను రాయుడు కలిశారు. ఐపీఎల్16 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన తర్వాత జట్టు యాజమాన్యంతో కలిసి సీఎం జగన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే సీఎం నిర్ణయాలను పలు సందర్భాల్లో సైతం ప్రశంసించారు.
దీంతో అంబటి రాయుడు మచిలీపట్నం లేదా గుంటూరు ఎంపీగా బరిలో ఉంటారంటూ ప్రచారం సాగింది. అయితే, తాను సీఎం జగన్‌తో రాజకీయ అంశాలు చర్చించలేదని స్పష్టం చేశారు. తాను ప్రజలకు ఏం చేయగలనో నిర్ణయించుకున్న తరువాతనే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తానని చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆ దిశగా నిర్ణయం తీసుకుని.. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాయుడు పొలిటికల్ ఎంట్రీపై స్పష్టత ఇచ్చిన తర్వాత.. వైఎస్సార్సీపీలో చేరటం ఖాయమనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నారు.