దేశ రాజధానిలోని దిల్లీ ఐఐటీ పరిశోధకులు కంటికి సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు సరికొత్తగా పెప్టైడ్ (అమినో ఆమ్లాల చైను) ఆధారిత శిలీంధ్ర నాశక విధానాన్ని రూపొందించారు. ఇది శిలీంధ్ర నాశక సాధకమైన 'నాటామైసిన్' చొరబాటును క్రియాశీలం చేసి ఫంగస్‌పై విస్తృతంగా పోరాడేలా చేస్తుంది. కుసుమా స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ అర్చనా చుగ్ నేతృత్వంలో దిల్లీ ఐఐటీ మహిళా పరిశోధకుల బృందం ఈ విధానాన్ని రూపొందించటం విశేషం.
ప్రయోగశాలలో ఈ మందును జంతువులపై పరీక్షించినపుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా అర్చనా చుగ్ మాట్లాడుతూ.. ఈ పెప్టైడ్స్‌కు పేలవంగా వ్యాపించే నాటామైసిన్ జత కలిసినపుడు జనించే శక్తి అద్భుతమైన శిలీంధ్ర నాశకంగా పనిచేస్తుందన్నారు. 'మేకిన్ ఇండియా'కు ఈ పరిశోధన చక్కటి నిదర్శనమని ఆమె అన్నారు. దేశంలోని బయో టెక్నాలజీ, ఫార్మాసూటికల్ పరిశ్రమలు ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్‌కు ముందుకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాసూటిక్స్‌లో వీరి అధ్యయనం ఇటీవల ప్రచురితమైంది.
ఇదీ చూడండి: అక్టోబర్-నవంబర్‌లో కరోనా మూడో ఉద్ధృతి!