వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సూచనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. జీ-20 అధ్యక్షత బాధ్యతలు భారత్ చేపట్టిన తరుణంలో.. కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా జీ-20 సమాఖ్య సమ్మేళనం, కార్యక్రమ నిర్వహణ, షెడ్యూల్‌ను వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, గోయల్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ ఏడాది డిసెంబర్ 1న జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా చేపట్టింది. ఈ నెల నుంచి దేశవ్యాప్తంగా 200కి పైగా సన్నాహక సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 , 10 తేదీల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది.
పదాధికారుల సమావేశం..
త్వరలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా భాజపా పావులు కదుపుతోంది. ఈ మేరకు పార్టీ జాతీయ పదాధికారుల రెండు రోజుల సమావేశాలను ప్రధాని మోదీ.. దిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశాల్లో భవిష్యత్ ఎన్నికల్లో పార్టీ ఎజెండాను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలకు భాజపా జాతీయ పదాధికారులతోపాటు.. అన్నిరాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరుగుతున్న.. ఈ సమావేశాల్లో భవిష్యత్ వ్యూహాలు, వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సన్నాహలపై విస్తృతంగా చర్చించనున్నారు. 2019లో ఓటమిపాలైన స్థానాల్లో.. 2024లో విజయం సాధించేందుకు కేంద్రమంత్రులతోపాటు పార్టీ ముఖ్యనాయకులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా ఈ సమావేశంలో ప్రణాళికలు రచించనున్నారు.