సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే.. తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే కార్యనిర్వహక కమిటీలో ఉన్న ముగ్గురు సభ్యులూ రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్, సీనియన్ న్యాయవాది జైదీప్ గుప్తా సహా.. హరిన్ పీ రావల్, నకుల్ దివాన్ ఈ పదవి నుంచి తప్పుకున్నారు.
వర్చువల్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని.. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్)తో చర్చించినట్టు సుప్రీంకోర్టు బార్అసోసియేషన్ తాత్కాలిక కార్యదర్శి రోహిత్ పాండేకు లేఖ రాశారు ఈ ముగ్గురు సభ్యులు. ఎన్ఎస్డీఎల్తో కుదిరిన ముసాయిదా ఒప్పందం ప్రకారం.. ఎన్నికల నిర్వహణ అంచనా వ్యయాన్ని జనవరి 14న ఎస్సీబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపినట్లు వివరించారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్యానెల్ సభ్యులుగా తమ విధులను కొనసాగించడం సాధ్యం కాదని వారు లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల జనవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించగా.. పలు అభ్యంతరాలు వ్యక్తం కావడం వల్ల సాధ్యపడలేదు.
అయితే.. ఎస్సీబీఏ ప్యానెల్ సభ్యుల రాజీనామాతో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని.. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేను కోరారు.
ఇదీ చదవండి: కొవిడ్ జ్ఞాపకాలు తలచుకొని మోదీ కన్నీటిపర్యంతం