దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న అవార్డును పొందిన వ్యక్తులందరూ ఎయిర్‌ఇండియా విమానంలో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2003లో అప్పటి వాజ్‌పేయీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పటి నుంచి భారత రత్న పురస్కార గ్రహీతల్లో ఒక్క అమర్త్యసేన్ మినహా ఎవరూ తమ ఉచిత టికెట్ అవకాశాన్ని వినియోగించుకోలేదని సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఎయిర్ ఇండియా సమాధానమిచ్చింది. నోబెల్ బహుమతి గ్రహీత కూడా అయిన అమర్త్యసేన్ 2015 నుంచి 2019 వరకు మొత్తం 21 సార్లు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారని సంస్థ వెల్లడించింది. ఉచిత టికెట్‌పై విధించే పన్నులను, ఇతర ఛార్జీలన్నిటినీ విమానయాన సంస్థే భరించేదని తెలిపింది.
ఎకానమీ క్లాసుకు టికెట్ ఇచ్చినప్పటికీ దానిని ఎగ్జిక్యూటివ్ క్లాస్ వరకు అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా వివరించింది. అయితే, మొత్తం 21 ప్రయాణాలకు ఎంత మొత్తం వ్యయం అయ్యిందనే వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. ఇప్పటి వరకూ మన దేశం మొత్తం 48 మందికి భారత రత్న అవార్డులను ప్రదానం చేసింది. వీరిలో 14 మందికి మరణానంతరం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. మిగిలిన 34 మందిలో అమర్త్యసేన్, లతా మంగేష్కర్, సచిన్ తెందుల్కర్, ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్.రావు మాత్రమే జీవించి ఉన్నారు.
ఇదీ చదవండి : వారికి ఉద్యోగాలు తిరిగి ఇవ్వాల్సిందే: హైకోర్టు