Agra Urination Incident : మధ్యప్రదేశ్‌లో గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన మరవకముందే.. అలాంటి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ యువకుడిపై కొందరు దుండగులు రక్తం కారేలా తీవ్రంగా దాడి చేశారు. అనంతరం నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్న భాదితుడి తలపై తంతూ.. దూర్భాషలాడుతూ.. మూత్రం పోశారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన 30 సెకన్ల వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదిత్య అనే ప్రధాని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి సహకరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై డీసీపీ (సిటీ) సూరజ్ కుమార్ రాయ్ స్పందించారు. 'ఒక నిందితుడిని అరెస్టు చేశాము. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ట్విట్టర్లో వైరల్ అయిన వీడియో ద్వారా ఈ ఘటనను గుర్తించాము. దీనిపై ఆగ్రాలోని ఏ పోలీస్ స్టేషన్లోనూ బాధితుడు ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ ఘటన మూడు-నాలుగు నెలల క్రితం జరిగిందని.. నిందితుడిని ఆదిత్యగా గుర్తించాము. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 307 (హత్య ప్రయత్నం)తో పాటు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము' అని చెప్పారు.
మద్యం మత్తులో అరాచకం.. గిరిజనుడిపై మూత్ర విసర్జన
Madhya Pradesh Urine Incident : మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో దాదాపు 3 నెలల క్రితం ఆదివాసీ యువకుడు దశరథ్ రావత్‌పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోశాడు. ఈ ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడం వల్ల మధ్యప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీంతో ప్రవేశ్ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి.. అతడి ఇంటిని కూడా బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని తన ఇంటికి బాధితుడిని పిలిపించుకుని కాళ్లు కడిగి క్షమాపణ కోరారు. బాధితుడిని కుర్చీపై కూర్చోబెట్టి, ఆయన కిందే కూర్చోని.. నీళ్లతో అతడి కాళ్లు కడిగారు. దశరథ్ రావత్‌ను సన్మానించి, స్నేహితుడిగా సంభోదిస్తూ.. సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో చూడాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.