Actress Sarala Kumari Missing in Sikkim Floods : సిక్కిం రాష్ట్రంలో ఇటీవల కుంభవృష్టి వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు (Sikkim Floods) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 14 మంది మృతి చెందగా.. మరో 26 మంది గాయపడ్డారు. 22 మంది జవాన్లు సహా మొత్తం 102 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన అలనాటి నటి సరళా కుమారి ఉన్నారు. తన తల్లి ఆచూకీ కనిపెట్టి.. తనకు తెలియజేయాలంటూ అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె నబిత తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
Telugu actress Sarala Kumari Missing in Sikkim : ఈ నెల 2న మిత్రులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్తున్నట్లు తల్లి సరళ.. తనతో చెప్పినట్లు నబిత పేర్కొన్నారు. 3వ తేదీన చివరిసారిగా తాను అమ్మతో మాట్లాడినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల్లో సిక్కిం వరదల గురించి తెలుసుకుని ఆర్మీ హాట్ లైన్ నంబర్లకు ఫోన్ చేసినా.. అవి పని చేయడం లేదని వాపోయారు. దయచేసి తమ తల్లిని కనిపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
Sikkim Flood : వరద బీభత్సానికి 14 మంది మృతి.. 102 మంది గల్లంతు.. ముమ్మరంగా గాలింపు చర్యలు
Sikkim Floods 2023 : ఈ నెల 2న ఫ్రెండ్స్‌తో కలిసి సిక్కిం వెళ్తున్నట్లు అమ్మ నాతో చెప్పారు. 3న చివరిసారిగా నేను అమ్మతో మాట్లాడాను. ఆ తర్వాత ఆమె నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు. టీవీల్లో సిక్కిం వరదల గురించి తెలుసుకుని ఆర్మీ హాట్‌లైన్ నంబర్లకు ప్రయత్నించాను. అవి పని చేయడం లేదు. దయచేసి మా అమ్మను కనిపెట్టండి. - నబిత, నటి సరళా కుమారి కుమార్తె
1983 సంవత్సరంలో మిస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎంపికైన సరళా కుమారి.. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించారు. దానవీర శూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం సినీ రంగానికి దూరంగా ఉంటున్న ఆమె.. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో నివాసం ఉంటున్నారు. అక్టోబరు 2న ఫ్రెండ్స్‌తో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. అక్కడే స్థానికంగా ఉన్న హోటల్లో వారు బస చేసినట్లు తెలిసింది. ఈ పర్యటన గురించి సరళా కుమారి.. అమెరికాలో ఉంటున్న కుమార్తె నబితకు సమాచారం ఇచ్చారు. వరదల సమయం నుంచి ఆమె ఆచూకీ లభ్యం కావడం లేదు.
సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో గత మంగళవారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. వాగులు, వంకలు, సరస్సులు పొంగిపొర్లాయి. దీంతో లాంచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఊహించని ఈ ఘటనతో పలువురు మృత్యువాత పడగా.. మరికొంత మంది గల్లంతయ్యారు.