తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన గోమతి అనే మహిళ.. నెలకు కేవలం ఒక్క రూపాయికే పేద పిల్లలకు విద్యనందిస్తున్నారు. పేదరికం, వివక్ష కారణంగా చాలా మంది విద్యార్థులు.. చదువుకు దూరమవుతున్నారని గమనించిన ఆమె 18ఏళ్లుగా ట్యూషన్ చెబుతున్నారు.
ఒక్క రూపాయికే..
తిరుచ్చి జిల్లాలోని ఓ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు గోమతి. అరియమంగళంలో పేద పిల్లల కోసం ట్యూషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా నెలకు ఒక్క రూపాయిని ఫీజు కింద తీసుకుంటూ..ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు పాఠాలు చెబుతున్నారు. దాదాపు 90 మంది విద్యార్థులు రోజూ ట్యూషన్‌కు హాజరవుతారు.
"చదువు గొప్పతనం నాకు తెలుసు. చిన్నతనంలో వీధి దీపాల కింద చదువుకున్నాను. పేద పిల్లలకు చదువుకోవాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అధిక ఫీజులు చెల్లించి ట్యూషన్లకు వెళ్లి చదువుకునే స్థోమత వారికి ఉండదు. అందుకే నేను ఒక్క రూపాయికే ట్యూషన్ చెబుతున్నాను."
--గోమతి, అకౌంటెంట్
పేద పిల్లల్లో ఆనందం
ఎలాంటి ఖర్చు లేకుండా విద్యను పొందుతున్న పిల్లలు.. తమ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలి నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
"మా టీచర్ ట్యూషన్ సెంటర్‌కు క్రమం తప్పకుండా వస్తారు. ట్యూషన్‌కి వచ్చి చదువుకునే విధంగా ప్రోత్సహిస్తారు. పాఠాలను అర్థమయ్యే విధంగా చెబుతారు. ఈ ట్యూషన్‌కి వచ్చిన దగ్గర నుంచి ఉన్నత చదువులు చదువాలనే ఆసక్తి ఏర్పడింది."
-- విద్యార్థి.
అయితే.. ప్రస్తుతం ఉన్న ట్యూషన్ భవనం సరిగ్గాలేదని.. వర్షం వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. తమకు శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చదవండి : దేశంలోనే తొలి 'వేద ప్లే స్కూల్'- ఎక్కడంటే?