నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలో రైతుల ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజు నిరసనలు చేపట్టారు రైతులు. సమస్య పరిష్కారానికి పలు దఫాలుగా కేంద్రం చర్చలు చేపట్టినా సానుకూల ఫలితం కనిపించటం లేదు. చట్టాల రద్దు తప్ప మరేదీ సమ్మతం కాదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో వారికి విపక్ష పార్టీల నుంచే కాకా దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
పద్మవిభూషణ్ వెనక్కి..
వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టిన రైతులకు మద్దతు ప్రకటించారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్. కేంద్రం వైఖరికి నిరసనగా తన పద్మ విభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. రైతులు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయక తమ హక్కులను కాపాడుకునేందుకు పోరాడుతున్నారని పేర్కొన్నారు.
అది దేశానికి ద్రోహమే: రాహుల్
సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయటం మినహా అంతకు తక్కువగా ఏదైనా అంగీకరించినట్లయితే అది దేశానికి, రైతులకు ద్రోహం చేయటమే అవుతుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కేంద్ర హోంమంత్రితో సమావేశమైన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు రాహుల్.
త్వరగా పరిష్కరించండి: అధిర్ రంజన్ చౌదరి
దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ వారికి మద్దతుగా నిలిచారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి. రైతులను బుజ్జగించే విధానాలను వీడి.. సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు తగిన గౌరవం, మర్యాదలు ఇవ్వాలన్నారు.
దేశవ్యాప్త ఆందోళనలు: మమత
కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, వారి జీవితాలపై ఆందోళన చెందుతున్నానని, కేంద్రం.. రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే.. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు. డిసెంబర్ 4న అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు దీదీ. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పలు చట్టాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
యూపీ-దిల్లీ రహదారుల మూసివేత
రైతుల ఆందోళనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్- దిల్లీ మధ్య రెండు రహదారులను మూసివేశారు పోలీసులు. గాజియాబాద్-దిల్లీ మధ్య ఉన్న ఎన్‌హెచ్-9, ఎన్‌హెచ్-14 రహదారులు సహా ఎన్‌హెచ్-1 కూడా మూసివేసినట్లు తెలిపారు. మరోవైపు చిల్లా సరిహద్దులో దిల్లీ-నోయిడా రహదారిని తెరవగా.. నోయిడా- దిల్లీ దారిని మూసి ఉంచారు. అలాగే దిల్లీ-హరియాణా సరిహద్దులను ఝరోదా, ఝటిక్రాల వద్ద మూసి ఉంచారు. బదుసరాయ్ సరిహద్దులో కేవలం ద్విచక్రవాహన రాకపోకలను అనుమతిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.
ఇదీ చూడండి: రైతు సంఘాల నేతలతో కేంద్రం కీలక భేటీ