ACB Court Hearing in CBN Bail Petition: సేనాని లేని సేనలు చెల్లాచెదురవుతాయని తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పాలన సాగించొచ్చన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం చంద్రబాబుపై కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టిందని ఆయన తరపు న్యాయవాదులు అనిశా కోర్టులో వాదనలు వినిపించారు. యువతకు ఉపాధి మార్గం చూపేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా వేసింది.
రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండకూడదన్న దురుద్దేశంతోనే చంద్రబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో నిర్బంధించారని.. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్‌కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ అనిశా కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాభివృద్ధి సంస్థను మంత్రిమండలి ఆమోదంతో ఏర్పాటు చేయడం తప్పెలా అవుతుందన్నారు.
Atchannaidu Sensational Comments on CID: ఆధారాలు చూపలేక సీఐడీ మరోసారి బోల్తా పడింది: అచ్చెన్నాయుడు
సీఐడీ రోజుకొక కొత్త ఆరోపణలు తెరపైకి తెస్తోందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలో భారీగా సొమ్ము జమయ్యిందని సీఐడీ ఆరోపిస్తోందన్న న్యాయవాదులు.. పార్టీకి అందిన విరాళాల వివరాలు పారదర్శకంగా ఉన్నాయన్నారు. టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన సొమ్ము వివరాలు రాబట్టేందుకు సీఐడీ పోలీసు కస్టడీ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బెయిల్ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు పూర్తయినా.. అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మళ్లీ వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. ఆ అభ్యర్థనపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అదనపు ఏజీ వాదనలకు తాము రిప్లై వాదనలు చెప్పామని.. మళ్లీ వీటిపై వాదనలు వినిపిస్తానంటే చట్టప్రకారం కుదరదన్నారు. ఈ సమయంలో ఇరువైపు న్యాయవాదుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది.
Chandrababu Naidu judicial remand extended: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ 19 వరకు పొడిగింపు
అదనపు ఏజీ స్వరం పెంచి కేకలు వేశారు. దీంతో అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు స్పందిస్తూ.. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, బెయిలు పిటిషన్‌పై అదనపు ఏజీ కొద్ది సమయం వాదనలు వినిపించాక, పోలీసు కస్టడీ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపారు.
వాదనల సందర్భంగా న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నా ముందు మీరెంత? అంటూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి..చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దూబేపై పెద్దగా అరుస్తూ కేకలు వేశారు. వాదనలు చెబుతానంటే ఎందుకు భయపడుతున్నారంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు.
పొన్నవోలు వ్యాఖ్యలపై దూబే తీవ్రంగానే స్పందించారు. ‘‘మేము మీకేమి భయపడట్లేదు. మీ వాదనలు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే మేము రిప్లై వాదనలు చెప్పాక... మళ్లీ రిప్లై వాదనలు వినిపిస్తానని మీరు అనటం ఏంటన్నారు. దీంతో పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పెద్దగా కేకలేస్తూ కోర్టు హాలు నుంచి విసురుగా బయటకు వెళ్లిపోయారు.
అంతకు ముందు దూబే అభ్యంతరాలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. ‘‘బెయిలు పిటిషన్‌పై నేను ఇంకా రిప్లై వాదనలు పూర్తి చేయలేదు. కస్టడీ పిటిషన్‌పై వాదనలు చెప్పలేదు’’ అని అన్నారు. దీనిపై చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
పోలీసు కస్టడీ పిటిషన్‌పై తాము వాదనలు ప్రారంభించక ముందే ఆ విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ‘‘బెయిలు పిటిషన్ దాఖలు చేసింది మేము, మా వాదనలు ముగిశాయి. మీరు రిప్లై వాదనలు వినిపించారు. ఈ కేసు విషయంలో చెప్పేది ఇంకేముంది.’’ అని అదనపు ఏజీని ఉద్దేశించి దూబే వ్యాఖ్యానించారు. దీంతో ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య కొంత సేపు వాడివేడిగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.