Hanuman chalisa: హనుమాన్ చాలీసా వివాదం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన మహారాష్ట్ర ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణాల కుమార్తె ఆరోహి రాణా.. బుధవారం ప్రత్యేక పూజలు చేసింది. అమరావతిలోని తమ ఇంట్లో హునుమాన్ చాలీసా పఠించింది. తన తల్లిదండ్రుల బ్యానర్ ఏర్పాటు చేసి ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించింది ఈ 8 ఏళ్ల చిన్నారి. వారు త్వరగా జైలు నుంచి విడుదలై ఇంటికి తిరిగి రావాలని కోరింది. ఈ పూజలో పాల్గొన్న వారితోనూ హనుమాన్ చాలీసా చదివించింది. బంధువులు, సన్నిహితులు సహా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MP Navneet Rana News: మహారాష్ట్ర సీఎం ఇంటి వద్ద తన భర్తతో కలిసి హనుమాన్ చాలీసా చదువుతానని ఎంపీ నవనీత్ రాణా గతవారం సవాల్ చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని మరిచిపోయారని, అది గుర్తు చేసేందుకు హనుమాన్ చాలీసా చదువుతానని ఆమె అనడం శివసేన కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో వారు ఏప్రిల్ 23న నవనీత్ రాణా ఇంటి వద్దకే వెళ్లారు. హనుమాన్ చాలీసా చదివేందుకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ తర్వాత నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణాను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.