Woman Cheated Software Engineer : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైన ఓ మహిళ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను బురిడీ కొట్టించింది. అతడి వద్ద నుంచి దాదాపు రూ. కోటి 14 లక్షలు వసూలు చేసింది. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 84 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది.. యూకేకు చెందిన కంపెనీలో 41 ఏళ్ల వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సాఫ్ట్వేర్ శిక్షణ కోసం బెంగళూరుకు కొన్నాళ్ల క్రితం వచ్చాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిస్టర్ అయ్యాడు. అనంతరం అతడికి సాన్వి అరోరా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో జులై 7న మహిళ నగ్నంగా.. బాధితుడికి వీడియో కాల్ చేసింది. బాధితుడికి తెలియకుండా ఆ వీడియోను రికార్డ్ చేసింది. ఆ తర్వాత ఆ వీడియోతో బాదితుడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోను అతడి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో భయపడిన బాధితుడు మొత్తం రూ. 1.14 కోట్లు.. నిందితురాలి బ్యాంక్ ఖాతాలకు యూపీఐ ద్వారా పంపించాడు. అయినా నిందితురాలు బెదిరిస్తుండటం వల్ల.. విసిగిపోయిన బాధితుడు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Woman Extorts Software Engineer : ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి నిందితురాలి ఖాతాలో రూ.84 లక్షలు సీజ్ చేశారు. నిందితురాలు రూ.30 లక్షలు వాడుకుందని తెలిపారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని.. ఆన్లైన్లో పరిచయం అయిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైట్‌ఫీల్డ్ డివిజన్ డీసీపీ ఎస్ గిరీశ్ తెలిపారు.
నగల వ్యాపారి ఘారానా మోసం.. రూ. 4 కోట్లు..!
బీమా డబ్బులను క్లెయిమ్ చేసుకునేందుకు ఓ నగల షాపు యజమాని ఘరానా మోసానికి తెరలేపాడు. రూ. 4కోట్ల విలువైన బంగారాన్ని తన మనుషులతోనే దొంగతనం చేయించాడు. అనంతరం తన బంగారం దొంగతనానికి గురైందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి.. కటకటాలపాలయ్యాడు.
ఇదీ జరిగింది..
రాజస్థాన్‌కు చెందిన రాజు జైన్ అనే వ్యక్తి బెంగళూరులోని నగర్పేటలో జ్యువెలరీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బులను క్లెయిమ్ చేసుకోడానికి.. తన షాపులోనే దొంగతనానికి ప్లాన్ చేశాడు. దీనికోసం ఇద్దరు యువకులకు సినీ ఫక్కీలో 20 రోజుల పాటు శిక్షణ ఇచ్చాడు. జులై 12న తాను బైక్‌పై వెళ్తుండగా.. తన నాలుగు కోట్ల విలువైన దాదాపు 3 కిలోల 780 గ్రాముల బంగారం చోరీకి గురైందని కాటన్‌పేట పోలీస్ స్టేషన్‌లో నకిలీ ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. రాజు జైన్ ఫోన్‌ను పరిశీలించినా.. ఏ సమాచారం దొరకలేదు. చివరకు దొంగతనానికి పాల్పడిన ఇద్దరు కిరాయి దొంగలను తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం బయటపడింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.